అఫ్గాన్ తాలిబాన్‌కు కొత్త నేత
అమెరికా డ్రోన్ దాడిలో మన్సూర్ మృతిని నిర్ధారించిన తాలిబాన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ తాలి బాన్ ఉగ్రవాద సంస్థ కొత్త అధిపతిగా హైబతుల్లా అఖుంద్‌జాదాను ఎన్నుకున్నట్టు ఆ సంస్థ బుధవారం తెలిపింది. సీనియర్ నేతలు సిరాజుద్దీన్ హక్కానీ, ముల్లా యాకూబ్‌లు హైబతుల్లాకు డిప్యూటీలుగా ఉంటారని వెల్లడించింది. పాకిస్తాన్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తమ అగ్రనేత మన్సూర్ మృతిచెందినట్టు గా తాలిబాన్ నిర్ధారించింది. మన్సూర్ మృతితో హైబతుల్లాకు అగ్రపీఠాన్నీ కట్టబెట్టారు. మిలిటరీ కమాండర్‌గా కంటే మత నాయకుడిగానే ఆయన ప్రసిద్ధికెక్కారు. మన్సూర్‌కు ఉన్న ఇద్దరు డిప్యూటీల్లో ఇతడు ఒకరు.
హైబతుల్లా.. తాలిబాన్ చీఫ్ జస్టిస్..
అఫ్గాన్ తాలిబాన్ కొత్త అధినేత హైబతుల్లా.. బయటి ప్రపంచానికి అంతగా తెలియని పేరు. గతంలో తాలిబాన్‌కు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. వారి ఉలేమాకు అధినేతగా ఉన్నారు. మత నియమాలను కచ్చితంగా పాటించాలనే విషయంలో కచ్చితంగా ఉండేవారు. తాలిబాన్ మిలటరీ ఆపరేషన్లకు సంబంధించిన పలు ఫత్వాలను జారీ చేశారు. కాందహార్ సమీపంలోని పంజ్వాయి జిల్లాకు చెందిన హైబతుల్లా.. అక్కడి నూర్జాయీ తెగకు చెందిన వారు. తాజాగా అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో హతమైన తాలిబన్ చీఫ్ మన్సూర్ తాలిబన్‌లో వర్గ విభేదాలను ప్రోత్సహించారని, అందువల్లనే తాలిబాన్ బలహీనమైందని, హైబతుల్లా నేతృత్వంలో మళ్లీ బలపడుతుందని భావిస్తున్నారు.