అనుకున్నదే అయింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం తరువాత అమెరికా, దాని మిత్రపక్ష సేనలు అఫ్ఘానిస్తాన్ నుంచి మే 1న వైదొలగడం మొదలవగానే, తాలిబన్‌ల విస్తరణ, ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఒక్కొక్క జిల్లాను హస్తగతం చేసుకుంటూ తాలిబన్‌లు శుక్రవారం తమ జన్మస్థానమైన కాందహార్‌లోకి ప్రవేశించాయి. భారత్ సైతం కాందహార్‌లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని హడావిడిగా వెనక్కి రప్పిస్తోంది. ఒకప్పుడు తాలిబన్‌ల కేంద్రస్థానమైన కాందహార్ అఫ్ఘాన్‌లో రెండో అతిపెద్ద నగరం. అఫ్ఘాన్ సేనలతో తాలిబన్‌ల తీవ్రఘర్షణ, అందులో రోజుకు 200 నుంచి 600 మంది దాకా బాధితులు, దేశంలో 85 శాతం తమ చేతుల్లో ఉందన్న తాలిబన్‌ల వాదన చూస్తుంటే– అఫ్ఘాన్‌లో ఏం జరగచ్చో అర్థమవుతూనే ఉంది. ఆ ఊహే నిజమైతే 1996లో లానే తాలిబన్‌ల పడగ నీడలోనే అఫ్ఘాన్ జనజీవితం ఇక లాంఛనమే కావచ్చు. ఈ పరిణామాల ప్రభావం భారత ఉప ఖండంపై ఎలా ఉంటుందన్న దాని మీద చర్చ ఊపందుకున్నది అందుకే!
అఫ్ఘాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూనే తాలిబన్‌లు సాయుధ సంఘర్షణకు దిగడం విచిత్రం. భారత్ మాత్రం ప్రస్తుత అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్నే ఇప్పటికీ గట్టిగా సమర్థిస్తోంది. మరోపక్క బైడెన్ అమెరికన్ సర్కారు మాటల ప్రకారం మరో నెలన్నరలో ఆగస్టు 31 కల్లా అఫ్ఘాన్ నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ పూర్తి కానుంది. దాంతో సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం అప్పటి జార్జ్ బుష్ అమెరికన్ ప్రభుత్వం అఫ్ఘాన్‌లోని తాలిబన్ ఏలుబడి పైన, ఉగ్రవాద అల్ కాయిదా సంస్థపైన మొదలు పెట్టిన సైనిక దాడి ప్రతీకార యజ్ఞానికి అర్ధంతరంగా తెర పడనుంది. చరిత్రలోకెళితే, ఇస్లామిక్ తీవ్రవాదుల బృందం అల్ కాయిదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో 4 విమానాలను హైజాక్ చేసి, ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ భవనాలపైన, అమెరికా రక్షణశాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్‌పైన దాడులు జరిపింది. 3 వేల మంది అమాయకుల దుర్మరణానికి కారణమైంది. ‘9/11 తీవ్రవాద దాడులు’గా ప్రసిద్ధమైన ఆ ఘటన, తాలిబన్‌ల అండ ఉన్న ఆ దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతం చేయడం, ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికన్ సేనలు అఫ్ఘాన్‌లో ప్రవేశించడం – ఓ సుదీర్ఘ చరిత్ర.
ఉగ్రవాదులు అఫ్ఘాన్‌ను స్థావరంగా చేసుకోవడానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యాన్ని సాధించా మంటూ సేనల్ని ఉపసంహరిస్తూ, అమెరికా – ‘నాటో’ సమష్టి ప్రకటన చేశాయి. క్షేత్రస్థాయిలో అది నేతి బీరకాయలో నెయ్యే కావచ్చు! నిజానికి, 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎన్నికల వాగ్దానమూ, తాజా బైడెన్ ప్రభుత్వం చేపడుతున్నదీ ఒకటే – అమెరికా సేనల ఉపసంహరణ! కాకపోతే, ఇరవయ్యేళ్ళు ఆతిథ్యమిచ్చిన అఫ్ఘాన్ ప్రభుత్వానికి మాట మాత్రంగానైనా చెప్పకుండా కీలకమైన బాగ్రమ్ సైనిక వైమానిక క్షేత్రం నుంచి అమెరికా సేనలు రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం విచిత్రం. అఫ్ఘాన్‌లో కొంత అభివృద్ధికీ, అక్షరాస్యతకూ దోహదపడ్డ అమెరికా ఆఖరికొచ్చేసరికి అక్కడ శాంతిస్థాపన కోసం చూడలేదు. మోయలేని బరువుగా మారిన సైనిక జోక్యాన్ని ఆపేసి, తన దోవ తాను చూసుకుంది. తాజా దండయాత్రలో కీలక బగ్రామ్ వైమానిక క్షేత్రం కూడా తాలిబన్‌ల చేతికి వచ్చిందంటే, తరువాతి లక్ష్యం అక్కడికి దగ్గరలో ఉన్న కాబూలే. అమెరికా సేనలు దేశం నుంచి తప్పుకోవాలన్నది తొలి నుంచీ తాలిబన్‌ల డిమాండ్. అది తీరుతున్నా తాలిబన్‌లు ఘర్షణకు దిగుతున్నారంటే, అది దేనికోసమో అర్థం చేసుకోవచ్చు.
మరోపక్క అఫ్ఘాన్ దేశ నిర్మాణం కోసమేమీ అమెరికా అక్కడకు వెళ్ళలేదనీ, ఆ దేశాన్ని ఎలా నడపాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే నిర్ణయం అఫ్ఘాన్ ప్రజలదేననీ బైడెన్‌కు హఠాత్ జ్ఞానోదయం ప్రదర్శించారు. అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ఇప్పటికే చైనా తప్పుబట్టింది. ఆ దేశం నుంచి తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కి తెచ్చే పనిలో పడింది. భారత దౌత్య సిబ్బంది పరిస్థితీ అదే. గతంలో 9/11 ఘటనకు రెండేళ్ళ ముందే 1999 డిసెంబర్‌లో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం ద్వారా తాలిబన్‌ల దెబ్బ భారత్ రుచిచూసింది. ఇండి యన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని తాలిబన్‌లు హైజాక్ చేయడం, అందులోని అమాయక ప్రయా ణికుల కోసం అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం నలుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టడం ఓ తరానికి కళ్ళ ముందు కదలాడే దృశ్యం. పాకిస్తాన్, చైనాలతో పాటు ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ ద్వారా మనమూ అఫ్ఘాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాం. అందుకే, ఇప్పుడక్కడ పాక్, చైనాలకు అనుకూలమైన తాలిబాన్‌ల ప్రాబల్యం భౌగోళికంగా, రాజకీయంగా మనకు పెద్ద చిక్కే.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో అంటకాగిన తాలిబన్ మూకలు ఇప్పటికిప్పుడు పవిత్ర మైపోయాయని అనుకోలేం. అమెరికాతో తాలిబన్‌లు మాట ఇచ్చినట్టు ‘జిహాద్’ను కేవలం తమ దేశానికీ పరిమితం చేస్తాయనీ నమ్మలేం. భారత్‌తో సహా పొరుగు దేశాల్లో జిహాద్‌ను సంకీర్తించే వారు అఫ్ఘాన్‌ను మళ్ళీ తమ అడ్డాగా మార్చుకొనే అవకాశాల్నీ కొట్టిపారేయలేం. వెరసి, సాయుధ తాలిబన్‌లు గద్దెనెక్కితే శాంతి సౌఖ్యాల కోసం వెంపర్లాడుతున్న మానవతావాదులకూ, మహిళ లకే కాదు... అఫ్ఘాన్ పునర్నిర్మాణం, సహాయ కార్యక్రమాల్లో 300 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించిన మన దేశానికీ దెబ్బే. మూడు దశాబ్దాలుగా రకరకాల కారణాలతో అఫ్ఘాన్ రక్తసిక్తం కావడం, రెండు దశాబ్దాల సైనిక జోక్యం తరువాతా ఆ దేశం అనిశ్చితిలోనే మిగలడమే ఓ విషాదం.
మళ్ళీ అదే అనిశ్చితి!
Published Mon, Jul 12 2021 12:09 AM | Last Updated on Mon, Jul 12 2021 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment