ఇస్లామాబాద్ : కవ్వింపు చర్యలు, ఉగ్రసంస్థలకు పరోక్ష సాయంపై పెదవి విప్పని పాకిస్థాన్ మరోసారి తన ధోరణిని బయటపెట్టింది. తమ దేశ సరిహద్దు, ఉపరితలాలపై తిరిగే డ్రోన్‌లపై దాడులు తప్పవని హెచ్చరించింది. అయితే ఈ క్రమంలో అమెరికా డ్రోన్ లు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని ప్రకటించటం చర్చనీయాంశమైంది.
పాక్ గగనతలంలోకి ప్రవేశించే ఏ డ్రోన్‌నూ విడిచిపెట్టం. నిబంధనలకు విరుద్ధంగా పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోబోం. అవి అమెరికాకు చెందిన డ్రోన్‌లు అయినా సరే కూల్చేయాల్సిందే. ఈ మేరకు పాక్ భద్రతా దళాలకు కఠిన సూచనలు చేశాం అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ తెలిపారు. ఇదిలా ఉంటే పాక్ చేష్టలపై అమెరికా గత కొన్నాళ్లుగా తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక ఆ ధోరణి మరీ ఎక్కువైంది.
కాగా, అఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో 2004 నుంచి అమెరికా సైన్యం గస్తీ కాస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎక్కువగా తలదాచుకునే అవకాశం ఉండటంతో డ్రోన్ పర్యవేక్షణ నిర్వహిస్తూ వస్తోంది. దీనిపై పాకిస్థాన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తూ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయ నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment