మయన్మార్‌లో సైనిక అత్యాచారాలు!
నేపితా/యాంగాన్: మయన్మార్ రాఖిన్ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా జాతి హింసాకాండ కొనసాగుతుండటంతో వేలాది మంది ‘రోహింగ్యా’ మైనారిటీ శరణార్థులు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు వలసపోతున్నారు. ‘మాపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇళ్లు కాల్చేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఉరితీస్తున్నారు. 10 ఏళ్లు పైబడిన వారు కనిపిస్తే చాలు.. సైన్యం వాళ్లను చంపేస్తోంది’ అని కొందరు శరణార్థులు పేర్కొన్నట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. ‘నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు’ అని బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ క్యాంప్‌లో తలదాచుకుంటున్న లాలు బేగం తెలిపింది. ‘అందమైన ఆడవాళ్లు కనిపిస్తే చాలు. నీళ్లు కావాలని అడుగుతారు. మహిళ ఇంట్లోకి వెళ్లగానే లోపలికి పోరుు అత్యాచారం చేస్తారు’ అంటూ పేర్కొంది. పది లక్షల మంది రాహింగ్యాలు రాఖిన్‌లో శరణార్థులుగా ఉంటున్నారు. అరుుతే మయన్మార్ ప్రభుత్వం వారిని అధికారికంగా గుర్తించలేదు. అక్రమంగా వలస వచ్చిన బెంగాలీలుగానే భావిస్తోంది.
ఉద్దేశపూర్వకంగానే స్పందించట్లేదు..
రోహింగ్యా ముస్లింల విషయంలో ఆంగ్‌సాన్ సూచీ ఉద్దేశపూర్వకంగానే మౌనం వహిస్తున్నారని మయన్మార్ పౌర హక్కుల సంఘాలు ఆరోపించారుు. సైన్యం దాష్టీకాలకు సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ సూచీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారుు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ‘సామూహిక బహిష్కరణ’ జరుగుతోందని, వేల మంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్తున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. సూచీ ఉదాసీనత వల్లే ఇదంతా జరుగుతోందని, ఆర్మీపై ఆమెకు నియంత్రణ లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నేత డేవిడ్ మాథిసన్ ఆరోపించారు.