
కృష్ణరాజపురం: బంగ్లాదేశ్ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సోబజ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడగా... అత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతని కాలికి తూటా గాయమైంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన వలస కూలీలు విందు చేసుకుని, అందులో ఒక యువతిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడడం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళల్ని అరెస్టు చేశారు. 10వ నిందితుడు సోబజ్... రామ్మూర్తి నగర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపుర చెరువు సమీపంలోని ఒక గుడిసెలో ఉన్నాడని తెలిసి బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసం వాహనాన్ని నిలపాలని కోరాడు. వాహనం దిగి వెళ్తూ తన వెనుకే వస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర నాయక్‌పై చాకుతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న ఎస్‌ఐ శివరాజ్‌పైనా దాడి చేశాడు. దీంతో ఎస్‌ఐ శివరాజ్ పిస్టల్‌తో కాల్చడంతో నిందితుని ఎడమ కాలికి గాయమైంది. నిందితునితో పాటు హెడ్‌కానిస్టేబుల్, ఎస్‌ఐకి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(చదవండి: బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన)