యాప్ ఉంటే చాలు కారు 'కీ' అక్కర్లేదు!
న్యూయార్క్: కారుకు ఇక కీ(తాళం చెవి) అక్కర్లేదు.. మీ స్మార్ట్ ఫోన్లో యాప్ ఉంటే సరిపోతుంది. ప్రముఖ స్వీడన్ వాహన తయారీ సంస్థ వోల్వో ఈ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుడుతోంది. కారు తాళం చెవి చేసే పనులన్నీ బ్లూటూత్ ఆధారిత డిజిటల్ కీ టెక్నాలజీతో పనిచేసే మొబైల్ యాప్ తో చేసేలా ఉండే కార్లను ఓల్వో రూపొందిస్తోంది.
ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు మల్టిపుల్ డిజిటల్ కీస్ను పొందే అవకాశం కూడా కల్పించనున్నారు. దీంతో వేరువేరు ప్రాంతాల్లో ఉన్న విభిన్న వోల్వో వాహనాలను ఈ యాప్ ద్వారా నియంత్రించే అవకాశం ఉంటుంది. కారును షేర్ చేసుకునే వారు సైతం తాళం చెవిల మార్పిడి లేకుండానే తమ డ్రైవర్లకు సులభంగా యాప్ ద్వారా యాక్సెస్ ఇవ్వడానికి వీలుంటుంది. కారును రెంటుకు తీసుకునే వారికి సైతం ఈ టెక్నాలజీతో ఉపయోగం ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల సమయం ఆదాచేసే ఈ యాప్ టెక్నాలజీ 2017లో అందుబాటులోకి రానుంది.