ఎక్కువకు తక్కువ.. తక్కువకు ఎక్కువ
ఉద్గారాలు విడుదల చేసే దేశాలపై ఇదీ ప్రభావం
లండన్: కనీస మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న దేశాలు.. ఎక్కువ మొత్తంలో కాలుష్యానికి కారణమవుతున్న దేశాల కంటే కూడా విపరీతమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలు తెలిపాయి. ఈ నివేదిక ప్రకారం అతి తక్కువ గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న దేశాల్లో తరచూ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, అలాగే ఇది ఆయా దేశాల ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని పరిశోధనలో తేలింది.
ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఉద్గారాలను విడుదల చేస్తున్న 36 దేశాల్లోని ప్రధానమైన యూఎస్, కెనెడా, ఆస్ట్రేలియా, చైనా, పలు పశ్చిమ యూరప్ లాంటి 20 దేశాలు తక్కువ ప్రభావాలను ఎదుర్కొంటున్నాయని వివరించింది. తక్కువ మొత్తంలో ఉద్గారాలను విడుదల చేస్తున్న 17 దేశాల్లో.. 11 దేశాలు ఎక్కువ ప్రభావాలకు గురవుతున్నాయి. ఆయా దేశాల్లో తరచు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతోపాటు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నాయి.
ఈ జాబితాలో ఉప సహారా దేశాలు, దక్షిణ ఆసియా దేశాలు ఉన్నాయి. ఇవి తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయని వివరించింది. ‘అధిక మొత్తంలో ఉద్గారాలు విడుదలవుతున్న దేశాల కంటే.. ఉద్గారాల విడుదలను నియంత్రించుకుంటున్న దేశాలే తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఈ రెండు రకాల దేశాల మధ్య ప్రకృతి వైపరీత్యాల ప్రభావంలో తీవ్ర వ్యత్యాసం ఉంద’ని పరిశోధనకు నేతృత్వం వహించిన వర్సిటీ పరిశోధకుడు గ్లెన్ ఆల్తర్ తెలిపారు. ఈ వ్యత్యాసం కొనసాగకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన చెప్పారు. ఈ వ్యత్యాసం ‘దమ్ముకొట్టని వారికి క్యాన్సర్ వచ్చినట్టు’ అని సహ పరిశోధకుడు జేమ్స్ వాట్సన్ అభివర్ణించారు.