గాలిలోకి అలా తేలిపోవచ్చు! | This is the perfect hoverboard if you want to be the Green Goblin | Sakshi
Sakshi News home page

గాలిలోకి అలా తేలిపోవచ్చు!

Published Tue, Apr 12 2016 5:02 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

గాలిలోకి అలా తేలిపోవచ్చు!

గాలిలోకి అలా తేలిపోవచ్చు!

పారిస్: గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే! అంటూ ఇక పాటకే పరిమతం కానక్కర్లేదు. గుండె జారకుండానే మబ్బుల్లో తేలిపోవచ్చు. గగన సీమలో విహరించవచ్చు. ఉన్నఫలంగా ఆకాశంలోకి ఎగిరిపోయేందుకు అద్భుత పరికరాన్ని కనుగొన్నారు వాటర్ జెట్ ఫ్లైబోర్డు సృష్టికర్త, ప్రపంచ జెట్ స్కై ఛాంపియన్ ఫ్రాంకీ జపాట. ఆయన తన వాటర్ జెట్ పైప్ ఫ్లైబోర్డుతో సముద్ర ఉపరితలంపై విన్యాసాలు చేస్తూ 2011లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు ఆయన వాటర్ జెట్ పైప్ సాయం లేకుండా ఆకాశమార్గాన విహరించేందుకు స్కేట్‌బోర్డు ఆకారంలో ఓ పరికరాన్ని కనుగొన్నారు. దానికి ‘ఫ్లైబోర్డు ఎయిర్’ అని నామకరణం చేశారు. దానిమీద నిలబడి జాక్ లాంటి ఓ పరికరాన్ని చేతుల్లో పట్టుకొని గాలిలోకి ఎగరవచ్చు. ఆకాశమార్గాన తిరిగి రావచ్చు. తాను తన పరికరానికి జెట్ ప్రొఫెల్లర్ యూనిట్‌ను ఏర్పాటు చేశానని, దానివల్లనే పరికరం గాలిలోకి ఎగురుతుందని ఫ్రాంకీ జపాట వివరించారు.

తాను కనిపెట్టిన ఈ సరికొత్త పరికరం ఎలా పనిచేస్తుందో చూడడానికి ఆయన ఆ పరికరంపై నిలబడి ఆకాశంలో 98 అడుగుల ఎత్తువరకు వెళ్లి అలా...అలా...విహరించి వచ్చారు. దాన్ని ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాకు విడుదల చేశారు.
వాస్తవానికి ఫ్లైబోర్డు ఎయిర్ అనే పరికరం ఆకాశంలోకి పది వేల అడుగుల ఎత్తువరకు వెళుతుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఫ్రాంకీ తెలిపారు. తాను ప్రయాణించినప్పుడు మూడు నిమిషాల 55 సెకండ్లకు 34 మైళ్ల వేగం అందుకుందని, తొలిసారి ప్రయోగాత్మక పరీక్ష కనుక 98 అడుగుల ఎత్తువరకు మాత్రమే వెళ్లి వచ్చానని వివరించారు.

ఫ్రాంకీ వీడియోను చూస్తే ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ఉందని, కానీ అది వాస్తవం కాకపోవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఫిజిక్స్ సూత్రాలు ఇలా గాలిలో ఎగరడానికి అనుమతించవని వారు వాదిస్తున్నారు. పైగా ఫ్రాంకీ ఎలా టేకాఫ్ తీసుకున్నారో వీడియోలో కూడా కనిపించలేదని, గాల్లోకి వెళ్లాక పరికరాన్ని ఎలా నియంత్రించారో స్పష్టతలేదని నిపుణులు అంటున్నారు.

ఫ్రాంకీ మాత్రం ఈ పరికరం నిజమని, నాలుగేళ్లు కష్టపడి ఈ ప్రోటోటైప్ మోడల్‌ను తయారు చేశానని చెబుతున్నారు. ఈ ఏడాది మాత్రం దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయలేనని అంటున్నారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement