లండన్: ఓవైపు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ల వివాహానికి రాజకుటుంబీకులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు పెళ్లి ఆపేయాలంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ప్రిన్స్ హ్యారీకి ఆ లేఖ రాసింది మరెవరో కాదు.. మేఘన్ మార్కెల్ సవతి సోదరుడు థామస్ మార్కెల్. ఇప్పటికీ మించి పోయిందేంలేదు.. పెళ్లి ఆపేస్తే మీ కుటుంబానికి మంచిదంటూ హ్యారీని థామస్ హెచ్చరించాడు.
ఈ నెల 19న లండన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో జరగబోయే రాయల్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. కానీ ఈ నేపథ్యంలో మేఘన్ సోదరుడు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్‌ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదు.
ఒక వేళ ఆమెను మీ ఇంటి సభ్యురాలిగా చేసుకుంటే రాజకుటుంబం గౌరవ, మర్యాదలు మంటకలిసిపోతాయి. పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మా కుటుంబానికి మేఘన్ చాలా దూరంగా ఉంటోంది. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. ఆమె ఎప్పటికీ నాకు చెల్లెలే. కానీ తన కుటుంబాన్ని, సన్నిహితులను వదిలేసుకుంది. ఎందుకంటే.. మేం సినిమా నిర్మాతలం కాదు. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలని' అని మేఘన్ సోదరుడు థామస్ ప్రిన్స్ హ్యారీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment