ప్రియాంక చోప్రా, మేఘన్ మార్కెల్
‘పెళ్లయ్యాక నువ్వు మొత్తం మారిపోయావు!’ అనే మాటలు బాగా వినిపిస్తుంటాయి స్నేహితుల మధ్య. నిజమే మరి! పెళ్లైపోతే ప్రియారిటీలు, ప్రపంచాలూ మారిపోతాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మేఘన్ మార్కెల్ పెళ్లి చేసుకోబోతోంది. మే 19న పెళ్లి. అదీ ప్రిన్స్ హ్యారీతో. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో పెళ్లంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ దేశాల పెద్దలంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో సూపర్‌స్టార్‌డమ్ అనుభవించిన మేఘన్, పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్టు చెప్పింది.
దీంతో ఆమెను ఫ్యాన్స్ ఇప్పట్నుంచే మిస్ అవుతూంటే, బెస్ట్‌ఫ్రెండ్ ప్రియాంక చోప్రా కూడా అంతే మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్ అనిపించుకొని ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మెప్పిస్తోన్న ప్రియాంకా చోప్రా, మేఘన్ మార్కెల్ ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్. ‘నాకు బెస్ట్‌ఫ్రెండ్ లాంటిది మేఘన్’ అని చెప్తుంది ప్రియాంక. తాజాగా మేఘన్ పెళ్లి చేసుకోబోతోందంటే ప్రియాంక కూడా ఎమోషనల్ అయిపోతోంది. ఆమెకు స్వయంగా ఒక లెటర్ కూడా రాసి పంపింది. ‘
‘బిర్యానీ, పౌటిన్‌లు తింటూ లెక్కలేనని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఈ మధ్యలోనే తనేంటో తెలుసుకోవడం ఎంత బాగుండేదో! ప్రపంచం గురించి, మనుషుల గురించి, చాలా విషయాల గురించి ఆలోచిస్తుంది మేఘన్. ఈ ప్రిన్సెస్‌కి ఇప్పుడు ప్రిన్స్ దొరికేశాడు. తన ప్రేమ జీవితం, పెళ్లి జీవితం అద్భుతంగా ఉండాలి. తనెప్పుడూ హ్యాపీగా ఉండాలి.’’ అంటూ ప్రియాంక రాసిన ఈ లెటర్ వాళ్లిద్దరి క్యూట్ ఫ్రెండ్‌షిప్‌ను చెప్పకనే బలంగా చెప్పేస్తోంది. ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్, మేఘన్ పెళ్లి తర్వాత కూడా ఇంతే క్యూట్‌గా ఉండిపోవాలని, మనమూ కాస్త సరదాగా, ఇంకాస్త ఇష్టంగా కోరుకుందాం!!
Comments
Please login to add a commentAdd a comment