న్యూసౌత్ వేల్స్‌లో ఎగసిపడుతున్న మంటలు
సిడ్నీ: ఆగ్నేయ ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటల తాకిడికి వేలాది మంది పర్యాటకులు, స్థానికులు సమీపంలోని బీచ్‌లకు పారిపోవాల్సి వచ్చింది. మల్లకూట పట్టణం సమీపంలోని బీచ్‌లకు దాదాపు 4 వేల మంది మంగళవారం పారిపోయి వచ్చారు. అడవులను అంటుకున్న మంటలు వాపిస్తున్న నేపథ్యంలో చాలామంది నివాసితులు ఇళ్లను విడిచి బీచ్‌లకు పరుగులు తీశారు. ఇటు బీచ్‌ల్లోని పర్యాటకులు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో అక్కడ ఏడుగురి జాడ కనిపించడం లేదు. అధిక జనాభా కలిగిన బాట్‌మన్స్ బే పట్టణానికీ మంటలు చేరాయి. ‘కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్ బాంబ్‌లను నిలిపేయాల్సి వచ్చింది’అని న్యూసౌత్ వేల్స్ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం తెలిపింది. విక్టోరియా అత్యవసర నిర్వహణ విభాగం కమిషనర్ ఆండ్రూ క్రిస్ప్ మాట్లాడుతూ.. మల్లకూటపై అగ్ని ప్రమాద ప్రభావం పడిందని చెప్పారు. ఇక్కడున్న ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment