రంజాన్ కు వినూత్న స్వాగతం!
జెడ్డాః రంజాన్ పర్వదినాల్లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, మసీదుల్లో ప్రార్థనలతో నెల రోజులపాటు పండుగ వేడుక అంగరంగ వైభవంగా సాగుతుంది. సూర్యోదయానికి పూర్వం నుంచీ సూర్యాస్తమయం వరకూ కఠిన ఉపవాస దీక్ష (రోజా) ను చేపట్టి, రాత్రి సమయంలో ఇఫ్తార్ విందుతో ఉపవాసాన్ని విడుస్తారు. నెల రోజులపాటు ఉపవాసాలు ముగిసిన తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి నెల్లాళ్ళ పాటు దాన ధర్మాలతో, భక్తిమార్గంలో జరుపుకునే ఈ రంజాన్ పండుగకు ముగ్గురు పాకిస్తానీ యువకులు వినూత్నంగా స్వాగతం పలికారు. అందరికీ ఆసక్తికరంగా ఉండేట్టు నీటి అడుగు భాగంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఎర్ర సముద్రం దిగువ భాగాన లాంతర్ల వెలుగులో పండుగను కొత్త రకంగా ఆహ్వానించారు.
సౌదీ అరేబియాలో నివసిస్తున్న యహేయా అష్ఫాక్, ఉమర్ జాన్, ఖాజీ అజ్మా లు ఎర్ర సముద్రం దిగువ భాగాన నూతన మార్గంలో రంజాన్ వేడుకలను ప్రారంభించారు. జెడ్డా తీర ప్రాంతంలోని ఎర్ర సముద్రం లోపలికి వెళ్ళి, నీటి అడుగు భాగంనుంచీ రంజాన్ కు స్వాగతం పలికారు. వారితోపాటు తీసుకెళ్ళిన లాంతర్ల వెలుగులోనే నీటికింద వేడుకలను నిర్వహించినట్లు కార్యక్రమం మొత్తాన్ని చిత్రీకరించిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యహేయా...స్థానిక వార్తా పత్రికకు తెలిపారు. సముద్రతీర ప్రాంతాలు, పగడపు దిబ్బలు, బీచ్ లను హైలెట్ చేసేందుకు, మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యతను తెలపడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. రంజాన్ సందర్భంగా నీటి అడుగు భాగాన వేడుకలు నిర్వహించడానికి అదే ముఖ్య కారణమంటున్నారు. అండర్ వాటర్ జీవితం ఎలా ఉంటుందో ఇప్పటివరకూ కనిపెట్టలేదని, ఇది పర్యాటకాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే యహేయా దుబాయ్, యాన్బులలో నీటి అడుగు భాగంలో డైవింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల బృందం రంజాన్ సందర్భంగా సముద్రానికి 140 అడుగుల కింది భాగంలో జెండాలు ఊపుతూ ప్రార్థనలు నిర్వహించినట్లు వారు చిత్రీకరించిన వీడియోలను బట్టి తెలుస్తోంది.
జెడ్డా పరిసర ప్రాంతాల్లో డైవింగ్ కు వెళ్ళేందుకు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య సమయం ఉత్తమమైనదని, సంవత్సరం మొత్తంలో ఆ రెండు నెలల సమయంలోనూ నీటి అడుగు భాగం ప్రత్యక్షంగా కనిపిస్తుందని, అలాగే నీటి ఉష్ణ్రోగ్రత కూడ సరిపడేట్లు ఉంటుందని యహేయా చెప్తున్నారు. భూమ్మీద, ఆకాశంలోనే కాక, నీటి అడుగు భాగాన కూడ విహరించి ఆనందించవచ్చని చెప్పడమే లక్ష్యంగా ఈ బృదం రంజాన్ వేడుకలను సముద్రానికి అడుగు భాగాన నిర్వహించింది.