టాయిలెట్ పేపర్లే పెళ్లి దుస్తులుగా..
లండన్: పెళ్లి దుస్తులు అనగానే ముందు మురిసిపోయేది మగువలే. తాళికట్టు శుభవేళ తాము ధరించే ఆ వస్త్రాలపైనే వారికి చాలా మోజుంటుంది. ఏరి కోరి వెతికివెతికి తమ పెళ్లి దుస్తులు సిద్ధం చేసుకుంటారు. కానీ, టాయిలెట్ పేపర్తో తయారుచేసే పెళ్లి వస్త్రాలు ఎవరైనా కొనుగోలు చేస్తారా.. ఒక వేళ అలాంటి సాహసమే చేస్తే.. అది కూడా వందల సంఖ్యలో అమ్మాయిలు చేస్తే.. న్యూయార్క్ నగరంలో ఇలాగే జరిగింది. ఓ బహుమతిని గెలుచుకునేందుకు అమెరికా ముద్దు గుమ్మలు టాయిలెట్ పేపర్ తో తయారు చేసిన వస్త్రాల కోసం పోటీ పడ్డారు.
వేలు కుమ్మరించి వాటిని తెప్పించుకొని క్యాట్ వాక్ లు చేశారు. ప్రతి ఏటా జరిగినట్లుగానే ఈ ఏడాది కూడా న్యూయార్క్ లో టాయిలెట్ పేపర్ వెడ్డింగ్ డ్రెస్ కాంపిటేషన్ జరిగింది. దీనిని చీప్ చిక్ వెడ్డింగ్స్ వాళ్లు నిర్వహించగా చార్మిన్ అనే టాయిలెట్ పేపర్స్ తయారీ సంస్థ బహుమతి దాతగా నిలిచింది. ఇందులో రూల్ ఏమిటంటే చార్మింగ్ సంస్థకు చెందిన టాయిలెట్ పేపర్స్ తోనే వెడ్డింగ్ డ్రెస్ తయారుచేయించుకుని ధరించాలన్నమాట. దీంతో వందల మంది అమ్మాయిలు ఎగబడి ఆ టాయిలెట్ పేపర్స్ తీసుకొని డ్రెస్ లు తయారు చేయించుకొని వేసుకొని తమ అందాలు ఆరబోశారు. అందులో మంచి టాయిలెట్ వెడ్డింగ్ డ్రెస్కు తొలి బహుమతిగా పది వేల డాలర్లు అందించారు.