అవసరం నడిపించినంత అభ్యుదయ పథంలో మనిషిని మరే ఇజమూ నడిపించలేదు. అందుకే బతికి బట్టకట్టి తీరాలనే పట్టుదల వారి చేత తాపీ పట్టించింది. స్వచ్ఛభారత్ వారికి తోడయ్యింది. సాధారణంగా నిర్మాణ రంగంలో మగవాళ్లు తాపీ పట్టుకుని ఇటుక పేర్చి, సిమెంట్ రాస్తుంటే... ఆడవాళ్లు తాపీ మేస్త్రీలకు సిమెంట్, ఇటుక అందించే పనిలో ఉంటారు.
అయితే అస్సాంలోని బార్‌పేట జిల్లాలో ఏకంగా మూడువందలకు పైగా మహిళలు తాపీ పని చేస్తున్నారు. వీళ్లలో బెంగాల్‌నుంచి అస్సాంకు వలస వచ్చిన ముస్లిం మహిళలున్నారు. ఇంకా.. స్థానిక బోడో మహిళలు, బెంగాలీ హిందువులు... ఇలా రకరకాల సాంస్కృతిక నేపథ్యాల మహిళలున్నారు. తాపీ పని నేర్చుకున్న తర్వాత వాళ్ల జీవితాలు ఎంత మెరుగయ్యాయో చెప్పడానికి బార్‌పేట జిల్లాలోని భులుకాబారీ పత్తర్ గ్రామంలో నూర్ నెహర్ బేగం జీవితమే ఉదాహరణ.
భార్యపై భర్తకు ఫిర్యాదు చేశారు!
‘‘ఊళ్లో పనుల్లేవు, మగవాళ్లు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. వాళ్లు వచ్చే వరకు ఇంటిని నెట్టుకొచ్చేదెలాగ? పొట్ట నింపడానికి ఎలాగో తిప్పలు పడతాం. కానీ పిల్లల ట్యూషన్‌కి ఫీజు కట్టాలంటే డబ్బెలా? అందుకే ఈ పని నేర్చుకున్నాను. ఇప్పుడు ఇల్లు గడిచేదెలాగ అనే బెంగ లేదు.
నేను తాపీ పని నేర్చుకున్నానని ఊళ్లో మగవాళ్లు నా భర్త వచ్చినప్పుడు ‘మగవాళ్లు చేయాల్సిన పనులు చేస్తోంది నీ భార్య ’ ఆయన్ను నిలదీశారు. ‘అలా నిలదీసిన వాళ్లలో ఎవరైనా నా బిడ్డల కోసం ఒక్క రూపాయి ఇచ్చారా’ అని నేను నా భర్తను అడిగాను. పోయినేడాది నేను తాపీ పని నేర్చుకున్నప్పుడు నేనొక్కర్తినే, ఇప్పుడు మా ఊరు, ఆ చుట్టు పక్కల 11 గ్రామాలకు కలిసి మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు’’ అంటోంది నూర్ నెహర్ బేగం.
పని ఇచ్చింది స్వచ్ఛ భారత్
మగవాళ్లే పనుల్లేక పరాయి రాష్ట్రాలకు వలస పోతున్న ఆ చిన్న గ్రామాల్లో అంతమంది మహిళలు తాపీ పని నేర్చుకున్నారు సరే, వాళ్లకు పని ఎలా? స్వచ్ఛభారత్ ఉద్యమం వీళ్లకు పని కల్పిస్తోంది. స్వచ్ఛభారత్‌లో టాయిలెట్‌లు కట్టడం ఒక ఉద్యమంలా సాగుతోంది. నిర్ణీత సమయంలో టార్గెట్‌ను చేరుకోవడానికి అధికారులకు చేతినిండా పని వాళ్లు కావాలి.
మగవాళ్లు వలస పోయిన కారణంగా అందుబాటులో ఉన్న మహిళా తాపీ మేస్త్రీలను ప్రోత్సహించారు అధికారులు. డిస్ట్రిక్ట్ వాటర్, శానిటేషన్ అధికారి అపర్ణా అధికారి ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. మగవాళ్లు కట్టిన టాయిలెట్‌ల కంటే ఆడవాళ్లు కట్టినవే బాగున్నాయనే ప్రశంసలు కూడా వస్తున్నాయి స్థానికుల నుంచి.
ఎక్కడా మొక్కబడిగా చేయలేదు
నేర్చుకునే దశలో ఉండడంతోనో లేక మహిళల్లో స్వతహాగా ఉండే సమగ్రత వల్లనో కానీ నిర్మాణం రూపం వచ్చిన తరవాత మా పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకోవడం లేదు బార్‌పేట జిల్లా మహిళలు. సిమెంట్ నిర్మాణానికి నీరు పట్టి, లీక్‌లు చెక్ చేయడం, వాటర్ క్యూరింగ్ వంటివన్నీ తమ బాధ్యతే అన్నట్లుగా చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌నాటికి జల్‌కారా గ్రామంలో పదిహేడు ఇళ్లకు మాత్రమే టాయిలెట్ ఉండేది.
ఇప్పుడు అదే గ్రామంలో 106 ఇళ్లలో పక్కా టాయిలెట్‌లున్నాయి. వీళ్లు మొత్తం ఐదు పంచాయితీలకు గాను 1,423 టాయిలెట్‌లు నిర్మించారు. ఈ స్ఫూర్తితో ఈ మహిళలు తమ ఇళ్లలో కూడా పక్కా టాయిలెట్‌ను నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదారుగురు బృందాలుగా ఏర్పడి, ఎవరికి ఎవరూ డబ్బిచ్చే పని లేకుండా, ఒకరి ఇంటి టాయిలెట్ నిర్మాణంలో మిగిలిన వాళ్లు సహాయం చేసుకుంటున్నారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment