కౌలాలంపూర్: మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. ఆదివారం లండన్ నుంచి మలేషియాకు వెళ్తున్న ఎమ్హెచ్1 విమానం, బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో భారీ కుదుపులకు లోనైంది. సుమారు రెండు నిమిషాల పాటు విమానం అల్లకల్లోలం సృష్టించడంతో అందులో ప్రయాణిస్తున్న 378 మంది ప్రయాణికులకు ప్రాణాలు గాల్లోనే పోయినంతపనైంది. ఈ ఘటనలో చాలా మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడటంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇళ్లకు చేరారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ఆ ఫ్లైట్లో తల్లిదండ్రులతో పాటు ప్రయాణించిన హరీత్ అనే 13 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై హరీత్ మీడియాతో మాట్లాడుతూ.. విమాన భారీ కుదుపులతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపాడు. ప్రయాణికులు అటూ ఇటూ విసిరేసినట్లుగా అయ్యారని, రెండు నిమిషాల అనంతరం సాధారణ స్థితికి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారని తెలిపాడు.
ఈ ఘటనలో గాయపడిన వారికి విమానం కౌలాలంపూర్ చేరుకోగానే చికిత్స అందించారు. అధికారులు ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2014లో ఎమ్హెచ్ 370 విమాన ప్రమాదంలో 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతైన విషయం తెలిసిందే.
378 మంది ప్రాణాలు గాల్లో కలిసేవి..!
Published Mon, Jun 6 2016 10:55 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement