
సాక్షి : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ రష్యాకు ఝలక్ ఇచ్చింది. రష్యాకు చెందిన 200 ట్విట్టర్ అకౌంట్లపై చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం కూడా అందించింది. గతేడాది జరిగిన అమెరికా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయంటూ ఆయా అకౌంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది.
గతంలో ఫేస్‌బుక్ 450 అకౌంట్లను వెలుగులోకి తీసుకురాగా.. అందులో 22 ట్విట్టర్‌తో సంబంధం ఉండటంతో వాటిని రద్దు చేశాం. ఆపై మరో 179 అకౌంట్లు మా పరిధిలోకి వచ్చాయి. వాటిని ప్రస్తుతానికి నిలుపుదల చేసి నిబంధనలను అతిక్రమించినట్లు రుజువైతే పూర్తిగా రద్దు చేసేస్తాం అని ట్విట్టర్ తెలిపింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా సాయం తీసుకున్నారని, ఇందుకు సంబంధించి ఈమెయిల్ రాయబారం కూడా నడిచిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ముఖ్యంగా ట్రంప్ గెలుపు కోసం రష్యా సోషల్ మీడియాను వాడుకుని సాంకేతికంగా సాయం చేసిందన్న ఆరోపణలే ఎక్కువగా వినిపించాయి. అయితే అదంతా ఉత్తేదేనని ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి రష్యన్ల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటున్నాయంటూ రష్యా ప్రభుత్వం ఈ మధ్యే హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగేకొన సాగితే 2018లో నిషేధం విధిస్తామని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఓ అడుగు ముందుకు వేసి ఇప్పుడు రష్యాకు చెందిన ట్విట్టర్ అకౌంట్లను రద్దు చేయటం విశేషం.