వాషింగ్టన్: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ ఖాతాలపై ట్విటర్ యుద్ధభేరి మోగించింది. కొందరు ప్రముఖులకు రాత్రికిరాత్రే నకిలీ ఫాలోవర్లు పుట్టుకొస్తూ అసత్యపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలు వ్యాపింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ఖాతాలను తొలిగించే పనిని ట్విటర్ చేపట్టింది. ఫలితంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి సహా పలువురు ప్రముఖులకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు తగ్గే అవకాశాలున్నాయి.
బాట్స్‌తోనే బెడద
కుప్పలుతెప్పలుగా నకిలీ ఖాతాలు రావడానికి ప్రధాన కారణం బాట్స్ అనే సాఫ్ట్‌వేర్. ఇది రీట్వీట్, ఫాలోయింగ్, అన్‌ఫాలోయింగ్, అకౌంట్ మేనేజింగ్ తదితరాలను ఆటోమేటిక్‌గా చేస్తుంది. ట్విటర్ వినియోగదారుల పని సులభంగా కావడానికి రూపొందించిన ఈ సాప్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం వల్ల నకిలీల బెడద ఎక్కువైంది. బాట్స్ వల్ల ఏదైనా ఒక విషయాన్ని నిరంతరం ట్రెండింగ్‌లో ఉంచే వెసులుబాటు ఉంది.
ట్వీట్‌లు, రీట్వీట్‌లన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతూ, ఎప్పటికీ ఒకే అంశంపై చర్చ జరిగేలా చేయడం వల్ల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. ఇప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెగ్జిట్ వంటి అంశాలపై ట్విటర్ వేదికగా చర్చ జరుగుతోందంటే దానికి కారణం బాట్స్. అందుకే ట్విటర్ ప్రధానంగా బాట్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా నడుస్తున్న ఖాతాలపై దృష్టిపెట్టింది. ఆటోమేటిక్ అకౌంట్లను సృష్టిస్తున్న సమయంలోనే పర్యవేక్షించి వాటిలో నకిలీవని తెరుచుకోకుండా కాకుండా అడ్డుకుంటోంది.
ఇలా ప్రతి రోజూ 50 వేలకు పైగా నకిలీ అకౌంట్లు క్రియేట్ కాకుండా అడ్డుకుంటున్నట్టు ట్విటర్ ఆడిట్ రిపోర్ట్ తెలిపింది. గంపగుత్తగా కొట్టే లైక్‌లు, వివిధ అకౌంట్ల నుంచి ఒకే విధంగా వచ్చే రీట్వీట్లు, ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ట్రోల్స్‌ను నిరోధించే చర్యల్ని చేపట్టింది. గత ఏడాది నుంచి ఫేక్ అకౌంట్ల ప్రక్షాళనను మొదలు పెట్టిన ట్విటర్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో అమితాబ్ బచ్చన్ ఫాలోవర్లు రాత్రికి రాత్రే బాగా తగ్గిపోవడంతో ఆయన ట్విటర్ తీరుపై మండిపడ్డారు.
ట్విటర్‌లో తిరుగులేని ట్రంప్
రెండు, మూడు స్థానాల్లో పోప్, మోదీ
జెనీవా: ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిచారు. రెండు, మూడు స్థానాల్లో వరసగా పోప్ ఫ్రాన్సిస్, ప్రధాని మోదీ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య రెండింతల కన్నా ఎక్కువ పెరిగింది. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బుర్సన్ కోన్ అండ్ వోల్ఫ్(బీసీడబ్ల్యూ) తాజా అధ్యయనంలో ఈ వివరాలు తెలిపింది. 5.2 కోట్ల ఫాలోవర్లతో ట్రంప్.. పోప్ కన్నా సుమారు 45 లక్షల మంది ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
ట్రంప్, మోదీల ఫాలోవర్ల సంఖ్య మధ్య తేడా సుమారు కోటిగా ఉంది. లైక్‌లు, రీట్వీట్‌ల పరంగా చూసినా ట్రంప్..పోప్, మోదీ కన్నా చాలా ముందంజలో ఉన్నారు. ఏడాది కాలంలో ట్రంప్ తన వ్యాఖ్యలకు సుమారు 26 కోట్ల లైక్‌లు, రీట్వీట్‌లు పొందారు. రీట్వీట్‌ల పరంగా చూస్తే ట్రంప్ కన్నా సౌదీ రాజు సల్మాన్ ఆధిక్యంలో ఉన్నారు. 2017 మే–2018 మే మధ్య కాలంలో సల్మాన్ 11 సార్లే ట్వీట్ చేయగా, ప్రతి ట్వీట్‌కు 1.5 లక్షల రీట్వీట్లు, ట్రంప్ ప్రతి ట్వీట్‌కు 20 వేల రీట్వీట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment