పదేళ్ల పాప భారీ పసిడి చేపను ఒడిసి పట్టింది. అంతేకాదు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన లొయిస్ చివలర్స్(10) అనే బాలిక యూకేలో అతిపెద్ద బంగారు చేప(గోల్డ్ ఫిష్)ను పట్టిన చిన్నారిగా ఘనత కెక్కింది. డాజెన్‌హామ్‌లోని ఛేజ్ లేక్స్‌లో 2.4 కిలోల బరువు, 13 అంగుళాల పొడవున్న బంగారు చేపను ఆమె పట్టింది. తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి ఏకంగా రికార్డు సృష్టించింది. 2010లో డొర్సెట్‌లోని పూలె లేక్‌లో స్కూల్ పిల్లాడు నిక్ రిచర్డ్స్ సృష్టించిన రికార్డును లొయిస్ బద్దలు కొట్టింది. దాదాపు కిలోన్నర బరువున్న బంగారు చేపను పట్టి అప్పట్లో రిచర్డ్స్ రికార్డు సృష్టించాడు.
లొయిస్ నాలుగేళ్ల వయసు నుంచే చేపలు పట్టడం నేర్చుకుంది. గతంలో ఓసారి ఆమె రెండు కిలోల చేపను పట్టుకుంది. తాజాగా యూకేలో అతిపెద్ద బంగారు చేపను పట్టి రికార్డుకెక్కింది. చేప బరువు తూచి, దాంతో ఫొటోలు తీసుకున్న తర్వాత గోల్డ్ ఫిష్‌ను మళ్లీ కొలనులో వదిలేసింది. లొయిస్ తండ్రి గ్యారీ కూడా 14 కిలోల బరువున్న చేపను పట్టి తన రికార్డును మరింత మెరుగు పరుచుకున్నాడు. తాము ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే లొయిస్ రికార్డు గురించి తెలిసిందని గ్యారీ సంతోషంగా చెప్పారు. చేపలు పట్టడమంటే తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు.
సాధారణంగా గోల్డ్ ఫిష్‌లను ఇళ్లలోని అక్వేరియం, గార్డన్ పాండ్స్‌లో పెంచుతుంటారు. గండు చేప జాతిలో తక్కువ సంఖ్యలో ఉండే గోల్డ్ ఫిష్‌ను లాటిన్‌లో 'కారాసియస్ అరాటస్ అరాటస్'గా పేర్కొంటారు. బంగారు చేప 2 నుంచి 18 అంగులాల వరకు పెరుగుతుంది. 40 ఏళ్ల వరకు జీవిస్తుంది.
భారీ బంగారు చేప!
Published Fri, Sep 22 2017 3:53 PM | Last Updated on Fri, Sep 22 2017 5:52 PM
Advertisement