UK girl
-
చిన్నారి చేతికి చిక్కిన భారీ బంగారు చేప!
పదేళ్ల పాప భారీ పసిడి చేపను ఒడిసి పట్టింది. అంతేకాదు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన లొయిస్ చివలర్స్(10) అనే బాలిక యూకేలో అతిపెద్ద బంగారు చేప(గోల్డ్ ఫిష్)ను పట్టిన చిన్నారిగా ఘనత కెక్కింది. డాజెన్హామ్లోని ఛేజ్ లేక్స్‌లో 2.4 కిలోల బరువు, 13 అంగుళాల పొడవున్న బంగారు చేపను ఆమె పట్టింది. తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి ఏకంగా రికార్డు సృష్టించింది. 2010లో డొర్సెట్లోని పూలె లేక్‌లో స్కూల్ పిల్లాడు నిక్ రిచర్డ్స్ సృష్టించిన రికార్డును లొయిస్ బద్దలు కొట్టింది. దాదాపు కిలోన్నర బరువున్న బంగారు చేపను పట్టి అప్పట్లో రిచర్డ్స్ రికార్డు సృష్టించాడు. లొయిస్ నాలుగేళ్ల వయసు నుంచే చేపలు పట్టడం నేర్చుకుంది. గతంలో ఓసారి ఆమె రెండు కిలోల చేపను పట్టుకుంది. తాజాగా యూకేలో అతిపెద్ద బంగారు చేపను పట్టి రికార్డుకెక్కింది. చేప బరువు తూచి, దాంతో ఫొటోలు తీసుకున్న తర్వాత గోల్డ్ ఫిష్‌ను మళ్లీ కొలనులో వదిలేసింది. లొయిస్ తండ్రి గ్యారీ కూడా 14 కిలోల బరువున్న చేపను పట్టి తన రికార్డును మరింత మెరుగు పరుచుకున్నాడు. తాము ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే లొయిస్ రికార్డు గురించి తెలిసిందని గ్యారీ సంతోషంగా చెప్పారు. చేపలు పట్టడమంటే తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. సాధారణంగా గోల్డ్ ఫిష్‌లను ఇళ్లలోని అక్వేరియం, గార్డన్ పాండ్స్‌లో పెంచుతుంటారు. గండు చేప జాతిలో తక్కువ సంఖ్యలో ఉండే గోల్డ్ ఫిష్‌ను లాటిన్లో 'కారాసియస్ అరాటస్ అరాటస్'గా పేర్కొంటారు. బంగారు చేప 2 నుంచి 18 అంగులాల వరకు పెరుగుతుంది. 40 ఏళ్ల వరకు జీవిస్తుంది. -
పూడ్చిపెట్టకండి.. త్వరలో నేను బతికిరావొచ్చు!
నన్ను పూడ్చిపెట్టకండి. నా శరీరాన్ని ఐస్‌లో భద్రపరచండి. భవిష్యత్తులో క్యాన్సర్‌కు చికిత్స కనుగొనవచ్చు. అప్పుడు నేను బతికే అవకాశం ఉంటుంది.. ఇది ఇటీవల మృతిచెందిన 14 ఏళ్ల బాలిక చివరి కోరిక. ఆమె కోరికను బ్రిటన్ కోర్టు మన్నించింది. లండన్‌కు చెందిన ఈ బాలిక గత ఏడాది ఆగస్టులో క్యాన్సర్ బారిన పడింది. తెలివైన అమ్మాయిగా పేరుతెచ్చుకున్న ఆమె అన్ని వైద్యచికిత్సలు విఫలమవ్వడంతో నెలరోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అయితే, తాను చనిపోయేముందు బ్రిటన్ హైకోర్టు జడ్జి జస్టిస్ పీటర్ జాక్సన్‌కు లేఖ రాసింది. ‘నేను జీవించాలనుకుంటున్నా. చాలాకాలం జీవించాలనుకుంటున్నా. నాకు సోకిన క్యాన్సర్‌కు భవిష్యత్తులో చికిత్స కనుగొనవచ్చు. అప్పుడే నేను మేలుకుంటాను. క్రియోజెనిక్ (ఐస్‌తో గడ్డకట్టించే) పద్ధతిలో నా శరీరాన్ని పరిరక్షించడం ద్వారా వందేళ్ల తర్వాత అయిన నాకు చికిత్స అందించే నన్ను మేలుకొలిపే అవకాశం ఉండొచ్చు’ అని ఆమె పేర్కొంది. ఆమె చివరికోరికను మన్నించిన జస్టిస్ పీటర్ జాక్సన్.. ఇలాంటి కేసు రావడం ఇంగ్లండ్‌లోనే తొలిసారి అని, ప్రపంచంలో కూడా ఇదే తొలి కేసు కావొచ్చునని పేర్కొన్నారు. బాలిక మౌలిక ప్రిజర్వేషన్ ఆప్షన్ (క్రియోజెనిక్)ను ఎంచుకుంది. ఇందుకోసం 46వేల డాలర్ల (రూ. 31.31లక్షల) ఖర్చు అవుతుంది. విడాకులు తీసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమె చివరికోరికపై భిన్నంగా స్పందించారు. ఇలాంటి పద్ధతిని ఎంచుకోవడానికి బాలిక తండ్రి నిరాకరించగా, తల్లి మాత్రం తన బిడ్డ చివరి కోరిక నెరవేరాలని ఆకాంక్షించింది. తల్లి అభిప్రాయానికే కోర్టు మొగ్గుచూపింది.