లండన్ : అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో భారీ విజయం చేకూరింది. 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల (రూ 300 కోట్ల) విలువైన హైదరాబాద్ నిజాం ఆస్తులకు సంబంధించిన హక్కులపై భారత్ వాదనను బ్రిటన్ హైకోర్టు బుధవారం సమర్ధించింది. 70 ఏళ్ల కిందటి ఈ కేసులో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టు తీర్పుతో లండన్‌లోని నేషనల్ వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్‌లో ఉన్న నిజాం నిధులపై తమకు హక్కుందని పాకిస్తాన్ పదేపదే చేస్తున్న వాదన పసలేనిదని తేలింది. దేశ విభజన సమయంలో అప్పటి హైదరాబాద్ నిజాం తనపై సైన్యం దండెత్తవచ్చనే భయంతో బ్రిటన్‌లో పాక్ హైకమిషనర్‌కు ఈ నిధులు పంపారు. ఈ నిధులు 1948 సెప్టెంబర్ నుంచి బ్రిటన్‌కు పాకిస్తాన్ హైకమిషనర్ ఖాతాలో ఉన్నాయి. వీటిపై తమకే హక్కులు ఉంటాయని పాకిస్తాన్ వాదిస్తుండగా, నిజాం వారసులు భారత్ ప్రభుత్వంతో కలిసి తమ వాదనలు వినిపించారు. ఈ నిధులు ఆయుధ నౌకలకు చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని పాక్ వినిపించిన వాదనలను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు ఈ నిధులు చెందుతాయని కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నిధి లబ్ధిదారునిగా ఏడవ నిజాంను గుర్తిస్తూ ఆయన ఇద్దరు మునిమనవలకు ఇది వారసత్వంగా సంక్రమిస్తుందని తెలిపింది. నిజాం ఆస్తులపై బ్రిటన్ హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరో చేదు అనుభవంగా మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment