
లండన్: ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యంతో పాటు అనువైన సమయం, సందర్భం కలిసి రావాలి. నచ్చిన వారికి మనసులో మాట చెప్పడానికి ప్రేమికులు పడే తిప్పలు మాములుగా ఉండవు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఎడి ఒకోరో అనే వ్యక్తికి. దాదాపు నెల రోజుల పాటు ప్రయత్నించి ఎట్టకేలకు తన మనసు దోచిన నెచ్చెలికి మనసులో మాట చెప్పాడు. అయితే ఈ నెల రోజుల్లో తన ప్రేమ విషయం చెప్పడానికి ఎక్కడ ఎలా ప్రయత్నించింది అనే వివరాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎడి. ప్రస్తుతం ఈ లవ్ ప్రపోజల్ స్టోరి తెగ వైరలవుతోంది. వివరాలు.. యూకే హెర్టిఫోర్డ్‌కు చెందిన ఎడి ఒకోరో అనే వ్యక్తి కాలీ అనే యువతిని ప్రేమించాడు. ఉంగరం తొడిగి తన మసులో మాట చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో ఉంగరం తీసుకున్నాడు. ఇక తన మనసులో మాట చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. రెస్టారెంట్, మాల్, బీచ్ ఒకటేమిటి.. ఇలా కాలీతో వెళ్లిన ప్రతి చోట తన ప్రేమ విషయం చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ధైర్యం సరిపోలేదు.
అయితే తాను ఎక్కడెక్కడ కాలీకి ప్రపోజ్ చేయాలని భావించాడో ఆ ప్రదేశాల ఫోటోలతో పాటు వీడియోలు కూడా తీశాడు ఎడి. ప్రతి ఫోటోలో ముందు కాలీ.. ఆమె వెనకే చేతిలో ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో ఉన్న ఎడి. కానీ ఈ ప్రయత్నాల గురించి కాలీకి ఏ మాత్రం తెలియదు. ఇలా ఓ నెల రోజుల పాటు ఎంగేజ్‌మెంట్ రింగ్ చేతిలో పట్టుకుని.. కాలీ వెనకే తిరిగాడు ఎడి. కానీ ప్రపోజ్ చేయలేదు. చివరకు ఓ రోజు ఇంట్లో కూర్చుని ఎంగేజ్‌మెంట్ రింగ్ చేతిలో పట్టుకుని దాన్నలా చూస్తుండగా.. అనుకోకుండా కాలీ గమనించడం.. ఇంట్లోనో ప్రపోజ్ చేయడం.. ఆమె ఒప్పుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. కాలీ తన ప్రేమను అంగీకరించిన తర్వాత ఎడి తన ప్రపోజల్ ప్రయత్నానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. దాంతో అతడి లవ్ ప్రపోజల్ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నీ ఐడియా సూపర్బ్’ అంటూ నెటిజనులు ఎడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment