మిరపకాయల పొగ వస్తోందని.. కోర్టుకు లాగారు!
పొరుగింటివాళ్లు బాగా ఘాటైన మసాలా సరుకులతో వంట చేస్తున్నారని, దానివల్ల విషపూరిత వాయువులు వచ్చి.. తనకు శ్వాసపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని యూకేలో ఓ మహిళ తన పొరుగింటి వాళ్ల మీద కోర్టు కేసు పెట్టింది. జంతుహక్కుల కోసం పోరాడే జోనా లూసీ క్రిడ్లిన్ అనే ఈ మహిళ తన పొరుగింటిలో ఉండే వారిని లండన్ హైకోర్టుకు లాగింది. ఆమె వాడుతున్న మిరపకాయల వల్ల బాగా ఘాటైన పొగ వస్తోందని, దానివల్ల తన శ్వాసనాళంలో కూడా మంట పుడుతోందని క్రిడ్లిన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ ఘాటైన వాసన తన ఇంట్లోకి చొచ్చుకుని వస్తోందని, పక్కింటివాళ్ల వంట పూర్తయిన 8 గంటల వరకు కూడా అది అలాగే ఉంటోందని, దానివల్ల తాను టార్చర్ అనుభవిస్తున్నానని తెలిపింది. అర్ధరాత్రి నిద్రలో లేచి, మంచి గాలి కోసం బాల్కనీలోకి వెళ్లాల్సి వస్తోందని.. ఇంట్లో అంతలా ఆ మిరపకాయల పొగ అలముకుంటోందని క్రిడ్లిన్ చెప్పింది. ఈ పొగను ‘సంఘ వ్యతిరేక ప్రవర్తన’గా భావించాలని క్రిడ్లిన్ కోరింది. తాను ఎన్నిసార్లు చెప్పినా పక్కింటివాళ్లు వినిపించుకోలేదని, తమ మిరపకాయల పొగతో తనను బాగా ఇబ్బంది పెట్టేశారని చెప్పింది.