వాషింగ్ మిషన్లో తల ఇరుక్కుపోయింది..
ఫ్యూకింగ్: ఎప్పటిలాగే తన బట్టలను శుభ్రం చేయాలనుకున్నాడో వ్యక్తి. అనుకున్నదే తడువుగా ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేశాడు. కానీ వాషింగ్ మిషన్ ఎందుకో ఆ రోజు మోరాయించినట్టుంది. దీని సంగతి ఏంటో చూద్దామంటూ వాషింగ్ మిషన్లో తలపెట్టేశాడు. అంతే అలా పెట్టిన తల అందులోనే ఇరుక్కుపోయింది. అదేంటో మరీ తల లోపలికి తొంగిచూసినప్పుడు సులభంగానే వెళ్లింది.. మళ్లీ వెనక్కి తల తిప్పడానికి ప్రయత్నిస్తే రాదేంటి.. భలే పనైందే.. ఎరక్కపోయి.. వచ్చి ఇరుక్కపోయినట్టైందే నా పని అనుకున్నాడా వ్యక్తి. ఈ సంఘటన ఎక్కడో కాదు.. ఆగ్నేయ చైనాలోని ఫ్యూజియన్ రాష్ట్రంలోని ఫ్యూకింగ్ నగరంలో చోటుచేసుకున్నట్టు డైలీ మొయిల్ వెల్లడించింది.
బాధితుడి నరకయాతనను గమనించిన తోటి స్నేహితులు.. వాషింగ్ మిషన్లోనుంచి అతని తలను బయటకు తీసేందుకు శతవిధాలుగా యత్నించారు. చివరి ప్రయత్నంగా అతడి చొక్కా విప్పి.. వాషింగ్ మిషన్ చివిరి కొనల్లో సబ్బును ఉపయోగించి అతని బయటకు లాగడానికి ప్రయత్నించారు. బాధితుడికి సరిగా శ్వాస అందకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చేసేది ఏమి లేక బాధితుడి స్నేహితులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది 40 నిమిషాలపాటు శ్రమిస్తేగానీ వాషింగ్ మిషన్ లో నుంచి అతగాడి తల బయటకు రాలేదు. మిషన్ లోనుంచి తలను తియడానికి ఒక లోహపు రంపముతో మిషన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోశారు. శ్వాస తీసుకునేందుకు వీలుగా మిషన్ కు రంధ్రాలు చేశారు. ఈ ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యహరించి విజయవంతంగా మిషన్ లోనుంచి బాధితుడి తలను బయటకు తీశారు. అమ్మయ్యా..! బ్రతికిపోయాను అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మెడ, తలకు మాత్రం చిన్న గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు. గత మార్చి నెలలో ఉత్తర చైనాలో హెబెయి ప్రాంతంలో రెండు భవనాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. ఆమెను రక్షించడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. నెమ్మదిగా ఎలాగో అలా ఆ మహిళను కిందికి దింపారు.