వాషింగ్టన్ : న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే జెట్బ్లూఎయిర్లైన్స్కు చెందిన ఇద్దరు పైలట్లపై.. అదే సంస్థకు చెందిన ఉద్యోగినులు అత్యాచార ఆరోపణలు చేశారు. విధులు ముగించుకుని సేద తీరే క్రమంలో డ్రగ్స్ ఇచ్చి తమపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో జరిగిన ఈ ఘటన కారణంగా తమ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ప్రాణాంతక వ్యాధులు బారిన పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు... గతేడాది మే 9న వాషింగ్టన్ నుంచి ప్యూర్టోరికోకు చేరిన తర్వాత తమకు బుక్ చేసిన హోటల్‌లో సదరు ఉద్యోగినులు బస చేశారు. అదే రోజు సాయంత్రం సరదాగా బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వాళ్లను పైలట్లు ఎరిక్ జాన్సన్, డాన్ వాట్సన్ అనుసరించారు. అనంతరం మాటలు కలిపి డ్రగ్స్ కలిపిన శీతల పానీయాలను వారికి ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం గురించి జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.
ఈ విషయం గురించి వారి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా వాట్సన్, జాన్సన్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ నా క్లైంట్ ఎంతో ధైర్యవంతురాలు. అందుకే కోర్టును ఆశ్రయించాం. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలని భావిస్తున్నాం. ఈ ఘటన వల్ల తనెంతో మానసిక వేదన అనుభవించింది. మేము చేసే అలుపెరగని ఈ పోరాటం.. మరెంతో మంది బాధితులు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ఆదర్శంగా నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరగణిస్తున్నామని, తమ ఉద్యోగుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని జెట్‌బ్లూ వివరణ ఇచ్చింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకునే దిశగా చర్యలు ముమ్మరం చేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment