వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి అమెరికన్ వ్యాపార దిగ్గజాల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నియంత్రణలను ఎత్తివేయాలని కోరుతూ పలు అమెరికన్ కంపెనీలు న్యాయస్ధానాన్ని ఆశ్రయించాయి. వీసా నియంత్రణలను సవాల్ చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలకు వ్యతిరేకంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో మంగళవారం లాసూట్‌ను నమోదు చేశాయి. అమెరికాలో పనిచేసేందుకు వచ్చే వేలాది ప్రొఫెషనల్స్, ఉద్యోగులపై వీసాల నిలిపివేత నిర్ణయం ప్రభావం చూపుతుందని పలు అమెరికన్ కంపెనీలు వాదిస్తున్నాయి. ట్రంప్ తన అధికారాలను అధిగమించి జారీ చేసిన ఉత్తర్వులు పలువురిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో కీలకమైన ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఐటీ నిపుణులు, డాక్టర్లు, నర్సులు,ఇతర కీలక రంగాల్లో పనిచేసే వారికి ఇవి ప్రతిబంధకమని, ఈ చట్టవిరుద్ధ వలస నియంత్రణలను రద్దు చేయాలని యూఎస్ పారిశ్రామికవేత్తలు, కంపెనీ అధిపతులు కోరుతున్నారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ తదితర వాణిజ్య సంఘాలు వీసా నియంత్రణలపై భగ్గుమంటున్నాయి. ట్రంప్ యంత్రాంగం వీసా నియంత్రణలపై తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ దనోహు కోరారు. చదవండి : అమెరికా తర్వాత ఇండియానే: ట్రంప్
ఆర్థిక వ్యవస్థ రికవరీ, పునరుద్ధరణకు ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని, వీసా నియంత్రణలతో అమెరికా నుంచి నైపుణ్యాలతో కూడిన వ్యక్తులను ఇతర దేశాలు ఆకర్షించే అవకాశం ఉందని ఎన్‌ఏఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ కాన్సుల్ లిండా కెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా అమెరికా వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక సంఘాలు దాఖలు చేసిన దావాపై హోంల్యాండ్ సెక్యూరిటీ, వైట్‌హౌస్, విదేశాంగ శాఖలు ఇప్పటివరకూ స్పందించలేదు. అన్ని రకాల వర్కింగ్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ జూన్ 22న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. ట్రంప్ నిర్ణయంతో అన్ని రంగాల్లో అమెరికా వ్యాపారాలకు హాని చేకూరుతుందని దావాలో ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడి అధికార పరిధికి మించి తీసుకున‍్నఈ నిర్ణయాన్ని ఫెడరల్ విభాగాలు, అధికారులు అమలు చేయరాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment