అనుమతి లేకుండా తమ సముద్రతీర ప్రాంతాల్లోకి అనుమతి లేదంటూ ప్రపంచ దేశాలు చేసిన వ్యాఖ్యలను అమెరికా తనదైన శైలిలో ఉల్లంఘించింది.
వాషింగ్టన్: అనుమతి లేకుండా తమ సముద్ రతీర ప్రాంతాల్లోకి అనుమతి లేదంటూ ప్రపంచ దేశాలు చేసిన వ్యాఖ్యలను అమెరికా తనదైన శైలిలో ఉల్లంఘించింది. గత ఏడాది దాదాపు 13 దేశాల్లో అమెరికా యుద్ధ నౌకలతో పాటు మిలటరీ విమానాలను తిప్పినట్లు పెంటగాన్ ప్రకటించింది. వీటిలో చైనా, భారత్, ఇండోనేసియా, ఇరాన్, లిబియా, మలేసియా, మాల్దీవులు, ఒమన్, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాలు ఉన్నాయి.
అయితే, ఎన్నిసార్లు ఆయా దేశాల తీరప్రాంతాల్లో అమెరికా దళాలు ప్రవేశించాయనే విషయాన్ని మాత్రం పెంటగాన్ వెల్లడించలేదు. ప్రపంచ దేశాలలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే అర్హత ఉందని చెప్పడానికి మాత్రమే ఇలా చేశామని పెంటగాన్ తెలిపింది. ఫ్రీడం నావిగేషన్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తైవాన్, నికార్ గువా, అర్జెంటీనాల్లో ఒక్కసారి మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది.
చైనా సొంతగా తయారు చేసుకున్న ద్వీపాల ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో అనేకసార్లు ప్రయాణించినట్లు, ఇక చైనా నుంచి సంకేతాలు అంది ఆగిపోయినట్లు ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న మిలటరీ ల్యాండ్ వద్ద ఎక్కువగా సంచరించనున్నట్లు యూఎస్ ఫసిఫిక్ కమాండ్ అడ్మిరల్ హ్యరీ హ్యారీస్ చెప్పారు. ఇక 2014లో అమెరికా 19 దేశాల తీరప్రాంతాల్లో ప్రవేశించింది. వీటిలో ఇరాన్, ఫిలిప్ఫీన్స్ లు ముందువరుసలో ఉన్నాయి.