వాషింగ్టన్/బీజింగ్: శక్తిమంతమైన దేశంగా అవతరించే క్రమంలో చైనా భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకునే యోచనలో ఉంది. రానున్న పదేళ్లలో న్యూక్లియర్ వార్‌హెడ్లను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది. తద్వారా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని అణ్వాయుధ స్థావరాలతో పాటుగా వైమానిక, నావికా స్థావరాల నుంచి అణుబాంబులను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. అదే విధంగా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా పలు చర్యలు చేపట్టింది. ఇండో- ఫసిఫిక్ ప్రాంతంపై పైచేయి సాధించేందుకు వీలుగా పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేషియా, యూఏఈ, కెన్యా, సిచిల్స్, టాంజానియా, అంగోలా, తజకిస్థాన్ తదితర దేశాల్లో నావికా దళాలు మోహరించేందుకు వీలుగా స్థావరాల ఏర్పాటుపై దృష్టి సారించింది.(చదవండి: కీలక ప్రాంతాలపై పట్టుబిగించిన భారత్)
ఇక నావికా దళంలో సుమారుగా 350 యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లతో అమెరికా(293 యుద్ధ నౌకలు)ను మించిపోయిన డ్రాగన్ ప్రపంచంలోనే అతిపెద్ద నావల్ ఆర్మీ కలిగిన దేశంగా ఎదిగేలా ప్రణాళికలు రచిస్తోంది. అయితే అత్యాధునిక సాంకేతికత, సామర్థ్యం కలిగిన అమెరికా యుద్ధ వాహన నౌకలతో పోలిస్తే చైనా ఎయిర్‌క్రాఫ్ట్‌ల సామర్థ్యం తక్కువేనని తెలుస్తోంది. ఈ విషయాల గురించి యూఎస్ కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో పెంటగాన్ ప్రస్తావించింది. పాతకాలం నాటి మెరైన్లకు స్వస్తి చెప్పిన చైనా వాటి స్థానంలో అత్యాధునిక, బహుళ ప్రయోజనాలు కలిగిన యుద్ధ నౌకలను రూపొందించే పనిలో ఉన్నట్లు పేర్కొంది.(చదవండి: సరిహద్దు ఉద్రిక్తతలు.. చైనాలో ఆహార సంక్షోభం)
అదే విధంగా పదాతి, వైమానిక, నౌకా స్థావరాల(న్యూక్లియర్ ట్రియాడ్ కెపాసిటీ) నుంచి అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అణ్వాస్త్రాలను తయారు చేసుకోవడానికి కావాల్సినంత పేలుడు సామాగ్రిని చైనా కలిగి ఉందని పేర్కొంది. గత కొంతకాలంగా అమెరికా- చైనాల మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో రక్షణ శాఖకు కేటాయించిన 700 బిలియన్ డాలర్లకు సంబంధించిన నిధుల బిల్లుపై యూఎస్ కాంగ్రెస్‌లో చర్చ సందర్భంగా ఈ మేరకు పెంటగాన్ వివరాలు సమర్పించింది.
కాగా రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలు తదితర మిలిటరీ కార్యకలాపాలకై గతేడాది భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా చైనా, భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని ది స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ సంస్థ(ఎస్‌ఐపీఆర్‌ఐ) వెల్లడించిన విషయం తెలిసిందే. 2018తో పోలిస్తే చైనా 2019లో మిలిటరీ మీద ఖర్చు చేసిన వ్యయం 5.1 శాతం పెరగగా.. చైనా, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ 6.8 శాతం ఎక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో తెలిపింది.
గతేడాది చైనా మొత్తంగా సైన్యం మీద 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా... భారత్ 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇక ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి పనిచేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే గ్వడార్ పోర్టులో సరికొత్త నిర్మాణాలు చేపట్టిన చైనా.. అక్కడ భారీ ఎత్తున నావికా దళాలను మోహరించేందుకు సిద్ధమవుతోందని గతంలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నౌకా దళాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలతో పొరుగు దేశాలకు సరికొత్త సవాళ్లు విసిరేందుకు సిద్ధమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment