
ఔను.. మా వాళ్లు కిడ్నాప్ అయ్యారు
ఇరాక్లో అమెరికా పౌరులు ఇటీవల కిడ్నాప్కు గురయ్యారు.
బాగ్దాద్: అమెరికా పౌరులు ఇటీవల ఇరాక్లో కిడ్నాప్కు గురయ్యారు. ఈ విషయాన్ని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం దృవీకరించింది. 'పలువురు అమెరికన్లు కిడ్నాప్కు గురయ్యారు. వారు ఎక్కడున్నారో గుర్తించి, రక్షించడానికి ఇరాక్ అధికారుల సహకారంతో ముందుకుపోతున్నాం' అని రాయబార కార్యాలయ అధికారి ప్రకటించారు. అయితే ఎంతమంది కిడ్నాప్కు గురయ్యారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ముగ్గురు అమెరికన్ కాంట్రాక్టర్లు, ఓ ఇరాకీ ట్రాన్స్లేటర్ బాగ్దాద్ దక్షిణ ప్రాంతంలో శుక్రవారం కిడ్నాప్కు గురైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. విదేశాల్లో ఉన్నటువంటి అమెరికా పౌరుల రక్షణ, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి జాన్ కిర్బీ తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ కిడ్నాప్కు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.