
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందన్న వార్తలు నిజమేనా? అమెరికా ఎన్నికల వ్యవస్థ అంత బలహీనమా? ట్రంప్ విజయంపై మొదట నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న హిల్లరీ మాటల్లో నిజముందా?.. అందులో కొంతవరకూ నిజముందని అమెరికా ఎన్నికల అధికారులు ప్రకటించారు. నిజంగా సంచలనం సృష్టించే వార్తే ఇది.
వాషింగ్టన్: గత ఏడాది హిల్లరీ క్లింటన్‌కు-డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 21 రాష్ట్రాల ఎన్నికలపై హ్యాకర్లు ప్రభావితం చేశారని ఎన్నికల సంఘం అధికారులు అమెరికా ప్రభుత్వానికి తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డానికి ముందే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ అధికారులు.. రష్యా నుంచి హ్యాకింగ్ జరిగే అవకాశం ఉందని ప్రకటించారు. ముఖ్యంగా ఎన్నికను ప్రభావితం చేసే ఫ్లోరిడా, ఓహియో, పెన్సల్వేనియా, వర్జీనియాలపై హ్యాకర్లు అధిక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. అలబామా, అలాస్కా, కొలరాడో, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, నార్త్ డకోటా, ఓక్లహామా, టెక్సాస్, వాషింగ్టన్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజాగా పరిశోధనల్లో తేలిందన్నారు. ఓటర్ల డేటాను తారుమారు చేయడం.. వీలైతే.. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేలా చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
‘కంప్యూటర్లను రష్యన్ హ్యాకర్లు నిరంతరం మానిటరింగ్ చేయడంతో పాటు.. సమాచారాన్ని దొంగిలించేందుకు పదేపదే ప్రయత్నించడం జరిగిందని’ కాలిఫోర్నియా సెక్రెటరీ అలెక్స్ పెడిల్లా చెప్పారు. ఇలాంటివి పదదేపదే జరిగితే అమెరికా ప్రజాస్వామ్యం, దేశ భద్రత ప్రమాదంలో పడతాయని ఆయన అన్నారు. అమెరికాలోని నిర్దేశిత రాష్ట్రాలపై రష్యన్ హ్యాకర్లు నిరంతరం డేటా చౌర్యానికి ప్రయత్నించారని.. ఇన్వెస్టిగేటింగ్ టీమ్‌లో సభ్యుడైన మార్క్ వార్నర్ తెలిపారు. ఇదిలా ఉంటే భవిష్యత్‌లో ఎన్నికల వ్యవస్థను హ్యాకర్ల బారినుంచి కాపాడేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని.. నేషనల్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్స్ కాన్నీ లాసన్ అధికారులను ఆదేశించారు.