వీసాకు సోషల్ మీడియాతో ముడి!
వాషింగ్టన్: వీసా జారీ ప్రక్రియను ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అభ్యర్థులు ఇకపై వీసా పొందాలంటే తమ సామాజిక మాధ్యమాల వివరాలు వె ల్ల డించాలని సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. తద్వారా ఉగ్ర కార్యకలాపాలు తదితర జాతి భద్రతకు భంగం కలిగించే విదేశీయులను నియంత్రించవచ్చన్నది ఆలోచన. ఈ మేరకు ప్రభుత్వ విభాగం వీసాదారులను అడగాలనుకొంటున్న కొన్ని ప్రశ్నలతో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అభిప్రాయాలను కూడా కోరింది.
ఈ తాజా నిబంధనతో ఏడాదికి 65 వేల మంది అభ్యర్థులపై ఈ ప్రభావం పడుతుందని వెల్లడించింది. ఇవే కాకుండా అభ్యర్థులు తమ జాతీయ, అంతర్జాతీయ ‘ట్రావెల్ హిస్టరీ’కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ‘ఒకవేళ అభ్యర్థి ఉగ్రవాదుల అధీనంలోని ప్రాంతాన్ని సందర్శించినట్టయితే, అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తదితర వివరాలు దౌత్య అధికారికి తెలపాలి. అవసరమనుకుంటే ఆధారాలు ఇవ్వాలి.
అలాగే సోదరులు, సోదరీమణులు, పిల్లల వివరాలు సమర్పించాలి. సామాజిక మాధ్యమాల వివరాలంటే ప్రైవసీకి భంగం కలిగించే పాస్‌వర్డ్స్ వంటివి ఇవ్వక్కర్లేదు’అని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. వీసా జారీలో అదనపు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న ట్రంప్ ఆదేశాల మేరకు ఈ వివరాలన్నీ సేకరిస్తున్నామని తెలిపింది. తద్వారా లా ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా వర్గాలను సంప్రదించాల్సిన అవసరం ఉండదంది.