న్యూయార్క్ : హెచ్1బీ వీసా నియంత్రణలపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. విదేశీ ప్రొఫెషనల్స్ విస్తృతంగా ఉపయోగించే హెచ్1బీ వీసాల నిలిపివేతపై ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 169 మంది భారతీయులు కోర్టును ఆశ్రయించారు. అయితే వీసా నియంత్రణలను విధించకుండా అధికార యంత్రాంగాన్ని నిరోధించేందుకు వాషింగ్టన్‌లోని యూఎస్ డిస్ర్టిక్ట్ జడ్జి అమిత్ మెహతా నిరాకరించారు. వర్క్ వీసాలపై అమెరికాలో నివసించి ఇటీవలే భారత్‌కు తిరిగివెళ్లిన 169 మంది భారత జాతీయులు ఈ కేసు దాఖలు చేశారు.
వీసా నియంత్రణలు ఏకపక్ష నిర్ణయమని వాదించిన వారు తమ వీసా దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ, హెచ్4 సహా అన్ని రకాల వర్కింగ్ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. వీసా నిలిపివేతను సవాల్ చేస్తూ దాఖలైన అభ్యర్ధనను తోసిపుచ్చడం ఇది రెండవసారి కావడం గమనార్హం. ఈనెల 4న కొందరు వీసా దరఖాస్తుదారులు దాఖలు చేసిన ఈ తరహా కేసును మెహతా కొట్టివేశారు.
కాగా, రెండు కేసుల్లోనూ అప్పీల్ చేసిన వారు అధ్యక్ష ఉత్తర్వుల ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆధారాలు చూపలేకపోయారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మరోవైపు వీసా నిలిపివేతలపై ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు పారిశ్రామిక సంఘాల అభ్యర్ధనను ఓక్లాండ్‌లో మరో ఫెడరల్ న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు సైతం వీసాల నిలిపివేత నిర్ణయం అమెరికన్ వ్యాపారాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment