అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ప్రజలు పట్టంకట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. దాంతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత నిరాశ చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత హయాంలో మాదిరిగానే ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు సహజంగా వ్యక్తమవుతున్నాయి. 80 శాతం పైగా భారత్ ఐటీ సర్వీసుల ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. హెచ్1బీ/ఎల్1 వీసాలపై(యూఎస్ కంపెనీలు విదేశీయులకు అందించే వీసాలు) ట్రంప్ తొలిసారి అధికారం వచ్చిన వెంటనే నిబంధనలను కఠినతరం చేయడం తెలిసిందే.
వీసా పరిమితులు?
గతంలో ట్రంప్ హయాంలో విదేశీ ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో పాటు వీసాల జారీపైనా పరిమితులు విధించారు. దీంతో అప్పట్లో ఐటీ కంపెనీలు వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విదేశీ సెంటర్లలో స్థానిక నిపుణులకే పెద్దపీట వేశాయి. 2016–17లో అమెరికాలో భారతీయ ఐటీ సంస్థల ఉద్యోగుల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ/ఎల్1 వీసాల ద్వారానే నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..
ఐటీ అగ్ర త్రయం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్1బీ వీసాలు గత పదేళ్లలో 50–80% తగ్గిపోయినట్లు అంచనా. ట్రంప్ నియంత్రణల తర్వాత ఇది జోరందుకుంది. 2019–20లో ఇన్ఫీ గ్లోబల్ సిబ్బంది 65 శాతానికి, విప్రోలో 69 శాతానికి ఎగబాకినట్లు బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 హయాంలో మళ్లీ వీసా పరిమితులు, కఠిన నిబంధనలు విధించినప్పటికీ.. పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు దేశీయ కార్యకలాపాలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 21% నుంచి 15%కి తగ్గిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలు కూడా భారత్ ఐటీ కంపెనీలకు సానుకూలాంశమని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా నియంత్రణలు ఉన్నప్పటికీ ట్రంప్ తొలి విడతలో దేశీ ఐటీ షేర్లు పుంజుకోవడం విశేషం. టీసీఎస్ 185 శాతం, ఇన్ఫోసిస్ 174 శాతం, విప్రో 140 శాతం చొప్పున ఎగబాకాయి.
Comments
Please login to add a commentAdd a comment