హెచ్–1బీ వీసా మళ్లీ షురూ
దరఖాస్తుల ప్రకియను పునరుద్ధరించిన అమెరికా
వాషింగ్టన్: ఐదు నెలల కిందట అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్–1బీ వర్క్ వీసా దరఖాస్తుల ప్రక్రియను అమెరికా పునరుద్ధరించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసింది.
తిరిగి సోమవారం దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించింది. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించినట్టు ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. తాజా నిర్ణయంతో భారత ఐటీ నిపుణులకు పెద్ద ఊరట లభించినట్టయింది. విదేశీయులు అమెరికా కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్–1బీ వీసాలను జారీ చేస్తారు.
65 వేల వీసాల మంజూరు లక్ష్యం...
2018 ఆర్థిక సంవత్సరానికి 65 వేల వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు యూఎస్‌సీఐఎస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే ఉన్నత విద్యలో డిగ్రీ కలిగిన వారిని ఉద్యోగాల్లో నియమించుకొనేందుకు వచ్చిన మరో 20 వేల అభ్యర్థనలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ప్రీమియం ప్రక్రియ కింద 15 రోజుల్లోనే వీసా మంజూరు చేస్తామంది. ఈ గడువు లోగా ఒకవేళ ప్రక్రియ పూర్తికాకపోతే దరఖాస్తుదారుడికి ప్రాసెసింగ్ ఫీజ్‌ను తిరిగి చెల్లిస్తామంది. అయితే నివాస పొడిగింపు తదితర హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రక్రియపై తాత్కాలిక నిలిపివేత కొనసాగుతుందని వెల్లడించింది.
బ్రిటన్ వర్సిటీల్లో పెరిగిన దరఖాస్తులు...
చెన్నై: బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం కోసం దక్షిణ భారత విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. రెండేళ్ల కిందటితో పోలిస్తే గత ఏడాది ఈ ప్రాంతం నుంచి దరఖాస్తుల సంఖ్య తొమ్మిది శాతం పెరిగినట్టు చెన్నైలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భరత్ జోషీ చెప్పారు. బ్రిటన్ వ్యవస్థ ఎంతో ఉత్తమమైనదని ఇక్కడి విద్యార్థులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దరఖాస్తులు అధికంగా ఉన్నాయన్నారు. అలాగే బ్రిటన్‌కు విజిట్ వీసాలు కూడా ఏటా పెరుగుతూ వస్తున్నాయన్నారు. వీసా దరఖాస్తుల్లో 80 శాతం ఇవేనన్నారు.