కొలంబస్‌ నుంచి హెచ్‌1బీ వరకు..! | from columbus to H1b visa | Sakshi
Sakshi News home page

కొలంబస్‌ నుంచి హెచ్‌1బీ వరకు..!

Published Sat, Feb 25 2017 2:07 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

కొలంబస్‌ నుంచి హెచ్‌1బీ వరకు..! - Sakshi

కొలంబస్‌ నుంచి హెచ్‌1బీ వరకు..!

  • అమెరికా జనమంతా వలసలు, వలసల వారసులే!
  • ఆదివాసీలు కూడా ఆసియా నుంచి తొలి వలసలు
  • కొలంబస్రాకతో యూరోపియన్వలసల వరద
  • ఆఫ్రికా దేశాల నుంచిబానిస నిర్బంధ వలసలు
  • మెక్సికో నుండి వ్యవసాయ కార్మికుల వలసలు
  • ఆధునిక కాలంలో ఆసియా వృత్తి నిపుణుల వలస
  • శ్వేతజాతీయుల ఆధిక్యం తగ్గుతుండటంతో ఆందోళన
  •  

    ‘‘మీ అలసిన ప్రాణులను, అభాగ్యులైన పేదలను, స్వేచ్ఛా వాయువుల కోసం పరితపిస్తున్న సామాన్యజీవులను, మీ తీరంలోని తిరస్కృతులను, గూడులేని బడుగులను, తుపాను తాకిడికి కకావికలమైన జనాలను నా దగ్గరకు పంపండి. స్వర్ణ ద్వారం పక్కన నేను నా కాగడా ఎత్తి పట్టుకున్నాను!’’ - అంటూ మౌనంగానే ఆహ్వానించే స్వేచ్ఛా ప్రతిమ ప్రపంచ ప్రజలందరికీ సుపరిచితమైనది. వలస జీవుల కలల స్వర్గంగా భాసిల్లే అమెరికా ముఖ ద్వారం న్యూయార్క్నగర సాగర తీరంలో ఆకాశాన్నంటుతున్నట్లుండే స్టాట్యూ ఆఫ్లిబర్టీ.. దేనికి ప్రతిరూపమో చెప్తూ అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్రాసిన పద్యంలోని పై నాలుగు చరణాలూ విగ్రహం వద్ద చెక్కి ఉంటాయి. అమెరికా అంటేనే వలస దేశం. అమెరికన్ల జాతి వలసల జాతి. వందల ఏళ్లుగా ఈ ‘కొత్త ప్రపంచం’ ప్రపంచ దేశాల ప్రజలకు గమ్య స్థానంగా కొనసాగుతోంది. ఆ దేశం పుట్టుక, నిర్మాణం, అభివృద్ధి అంతా వలసలతోనే సాగిందని చరిత్ర తేటతెల్లం చేస్తోంది. ఆ వివరాలివీ...

    (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

    అమెరికా రాజకీయవేత్తలే కాదు.. అమెరికన్లు సైతం తమను తాము ‘వలసల జాతి’గా అభివర్ణించుకోవడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. అక్కడి ఆదివాసీలను మినహాయిస్తే.. ఎవరిని కదిలించినా వారి పూర్వీకుల మూలాలు మరో దేశంలో ఎక్కడో ఉంటాయి. ప్రతి ఒక్కరి కుటుంబాలూ కొన్నేళ్ల కిందట స్వేచ్ఛ కోసమో, మెరుగైన జీవితం కోసమే అమెరికాకు వలస వచ్చిన వారే. ప్రధానంగా యూరప్‌ దేశాలు, లాటిన్‌ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు, చైనా, ఇండియా తదితర ఆసియా దేశాల వలసలతో ప్రస్తుత అమెరికా రూపొందింది. ఈ భిన్న దేశస్తులు, జాతుల వారంతా కలగలసిపోయి ఒక అమెరికన్‌ జాతిగా రూపొందారు. తమవైన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను రూపొందించుకున్నారు. ప్రపంచంలోనే తొలి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించారు.

    ఇప్పటికీ.. అమెరికానే ప్రపంచ ప్రజల గమ్యస్థానంగానే ఉంది. అయితే.. అమెరికాలోకి వలసలను ఆహ్వానించే క్రమంలో చాలాసార్లు కొందరికి ప్రాధాన్యమిచ్చారు. మరికొందరిపై ఆంక్షలు విధించారు. అలా శ్వేతజాతీయుల ఆధిక్యం కొనసాగాలే చూశారు. ఇప్పుడు ఆ శ్వేతజాతీయుల ఆధిక్యం, ఆధిపత్యం తగ్గుతున్న సంకేతాలతో మరోసారి వలసల నియంత్రణ చర్యలకు తెరతీశారు. ఆ క్రమంలోనే వలసలపై కఠినస్వరం వినిపిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్షుడయ్యారు. కానీ.. ప్రపంచీకరణ పరిణామాలు పెనవేసుకుని ఉన్న అమెరికాతో పాటు.. ప్రపంచ దేశాల్లోనూ ఈ వలస నియంత్రణ చర్యలు అలజడి, ఆందోళన సృష్టిస్తున్నాయి.

    వేల ఏళ్లనాడు ఆదివాసీల వలస..: ప్రస్తుత అమెరికా దేశం సహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో మానవుల ఉనికే వలసలతో మొదలైంది. తొలిసారి మంచుయుగంలో ఆసియా నుండి జనం ఈ ఖండాలలోకి వలస వచ్చారు. వారి వారసులే ప్రస్తుతం అమెరికన్ ఆదివాసీలు. మంచుయుగంలో ఆసియాను అమెరికా ఖండాలతో కలిపిన బేరింగియా అనే ప్రాంతం (ప్రస్తుతం బేరింగ్ జలసంధి ప్రాంతం) మీదుగా రెండు మూడు దఫాలుగా ఆసియా వాసులు అమెరికా ఖండంలోకి ప్రవేశించి క్రమంగా విస్తరించి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారుల అంచనా. క్రీస్తు పూర్వం 30 వేల సంవత్సరాల నుంచి 10 వేల సంవత్సరాల మధ్య ఆ తొలి వలస ప్రజలు వచ్చారు. తొలుత వేట ప్రధానంగా జీవించే సంచార జాతుల ప్రజలైన వీరు క్రమంగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని వేల ఏళ్ల పాటు.. ఇటీవలి పదిహేనో శతాబ్దం వరకూ ఆ భూభాగాలకు కానీ, ఆ ప్రజలకు కానీ మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండాపోయింది. ఆ ఖండాలు, జనాల ఉనికే మిగతా ప్రపంచానికి తెలియదు.

    కొలంబస్రాకతో యూరోపియన్ల వలస : కొత్త మార్గంలో ఇండియా వెళ్లాలని బయల్దేరిన పోర్చుగీసు నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1492లో అనుకోకుండా అమెరికా ఖండం చేరుకోవడంతో ఈ ‘కొత్త ప్రపంచం’ గురించి ప్రపంచానికి తెలిసింది. అక్కడ నివసించే ఆదివాసీలను తొలుత భారతీయులుగా భావించారు. అందుచేత వారిని ‘రెడ్‌ ఇండియన్లు’గా అభివర్ణించారు. ఇప్పుడు ఆదివాసీ అమెరికన్లుగా పిలుస్తున్నారు. అపార ఖినిజ సంపదలు నిక్షిప్తమై ఉన్న విశాలమైన భూభాగాలు కనిపించడంతో.. ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాల నుంచి భారీ ఎత్తున తెల్ల జనాలు ఇక్కడికి వలసలు రావడం మొదలైంది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇక్కడ భూభాగాలను ఆక్రమించి వలస రాజ్యాలను ఏర్పాటు చేశాయి. వారి మధ్య ఆధిపత్య పోరాటాలూ సాగాయి.

    యూరోపియన్ల రాకతో ఆదివాసీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. యూరప్ వాసుల క్రౌర్యానికి, యూరప్ నుంచి వచ్చిన వ్యాధులకు ఆదివాసీల్లో చాలా మంది బలైపోయారు. ఒక మైనారిటిగా మిగిలిపోయారు. మెజారిటీగా మారిన యూరప్ వలస ప్రజలు ఆయా దేశాల కాలనీల్లో నివసించేవారు. బ్రిటన్ వలస పాలనలో ఉన్న పలు కాలనీలు.. బ్రిటన్‌ మీద తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించకున్నాయి. తదనంతరం మరికొన్ని కాలనీలూ అందులో కలిశాయి. అలా మొత్తం 50 రాష్ట్రాలతో ప్రస్తుత యూఎస్ఏ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) ఏర్పడింది.

    ఆఫ్రికా నల్లవారిని బానిసలుగా తరలింపు..: యూరప్‌ నుంచి వ్యక్తులుగా, కుటుంబాలుగా అమెరికాకు వలస వచ్చిన వారు విశాల మైదానాలను ఆక్రమించుకున్నారు. ఆ భూముల్లో పొగాకు, పత్తి తదితర వాణిజ్య పంటలను సాగు చేయడానికి అవసరమైన శ్రామికుల కోసం ఆఫ్రికా నుంచి లక్షలాది మందిని బలవంతంగా అమెరికాకు బానిసలుగా తీసుకువచ్చారు. రెండు దశాబ్దాల పాటు ఈ బానిస వ్యాపారం అవిచ్ఛన్నంగా కొనసాగింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత అమెరికాను ఈ ‘బానిస’లే నిర్మించారు. దక్షిణ అమెరికాలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బానిస శ్రమ శక్తే నిర్మించింది.

    పారిశ్రామికీకరణ జరిగిన ఉత్తర భాగానికీ ఈ బానిసలే ప్రధాన శ్రామికులయ్యారు. కానీ.. నాడు ఆ బానిసలకు పౌరసత్వం లేదు. సొంత ఆస్తి లేదు. కేవలం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఇంకో రకంగా చూస్తే.. అమెరికాలో తొలి ‘అక్రమ వలస’లు ఈ ఆఫ్రికన్ల బలవంతపు వలసలే. 1809లో అమెరికా రాజ్యాంగం.. దేశంలోకి బానిసలను అనుమతి లేకుండా ‘దిగుమతి’ చేయడాన్ని (అక్రమ రవాణా చేయడాన్ని) నిషేధించింది. కానీ.. బానిసల నల్లబజారు వ్యాపారం అంతర్యుద్ధం వరకూ కొనసాగింది. ఒక చరిత్రకారుడి అంచనా ప్రకారం బానిసల అక్రమ దిగుమతిని నిషేధించిన తర్వాత కూడా 15 లక్షల మందిని ఆయా దేశాల్లోకి తీసుకొచ్చారు.

    శ్వేత జాతి వలసలకే ప్రాధాన్యం..: 1965కు ముందు జర్మనీ నుంచి అత్యధిక వలసలు వచ్చారు. 1880 నుంచి 1930 వరకూ దాదాపు 50 లక్షల మంది జర్మన్లు అమెరికాకు వచ్చారు. వారిలో అత్యధికులు పశ్చిమ మధ్య ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వలసల నియంత్రణకు కఠిన చర్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత ఫ్రెడరిక్‌ ట్రంప్‌ కూడా ఇలా.. 1885లో అమెరికాకు వలస వచ్చిన జర్మన దేశస్తుడే. 1820 నుంచి 1930 వరకూ 35 లక్షల మంది బ్రిటిష్‌ వాళ్లు, 45 లక్షల మంది ఐరిష్‌ ప్రజలు అమెరికాకు వచ్చారు. మొత్తంగా 2.5 కోట్ల మంది యూరోపియన్లు.. ఇటాలియన్లు, గ్రీకులు, హంగేరియన్లు, పోలిష్‌ ప్రజలు తదితరులు ఒక వెల్లువలా అమెరికాకు వచ్చారు. వారిలో 24 లక్షల నుంచి 40 లక్షల మంది యూదులు కూడా ఉన్నారు. ఆసియాలోని రష్యా, చైనా, జపాన్‌, ఇండియా, ఇండొనేసియా తదితర దేశాల నుంచి కూడా కొద్దోగొప్పో శ్రామికులుగా వలసలు వచ్చారు.

    దక్షిణ, తూర్పు యూరప్‌ల నుంచి - అంటే ప్రధానంగా ఇటాలియన్లు, యూదులు - వచ్చే కొత్త వలసలు.. జన్యుపరంగా ‘తక్కువ’ జాతి వారని, అమెరికన్ల జీవన ప్రమాణాలకు ముప్పు అవుతారని రాజకీయ నాయకులు ఆందోళన చెందడంతో.. మొదటి ప్రపంచ యుద్ధం నాటి నుంచీ 1965 వరకూ.. అమెరికా వలస విధానాన్ని ‘శ్వేతజాతీయు’ల ఆధిక్యానికి అనుగుణంగా మలచుకున్నారు. ఆ క్రమంలో 1924లో జాతీయ మూలాల ఫార్ములాతో చట్టం చేశారు. ఆయా దేశాల నుంచి వలసలకు నిర్దిష్ట కోటా పరిమితులు నిర్ణయించారు. 1890లో అమెరికాలో ఏ దేశస్తులు ఎక్కువగా ఉన్నారనేది దీనికి ప్రాతిపదిక. ఆసియా వాసులు దేశంలోకి రాకుండా దాదాపుగా నిషేధించారు. ఫలితంగా దేశ జనాభాలో జాతుల నిష్పత్తి 1965 వరకూ మారలేదు. తద్వారా అమెరికాలో శ్వేతజాతీయుల ఆధిక్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చట్టాల కారణంగా అమెరికాలోకి చట్టబద్ధమైన వలసల సంఖ్య పడిపోయింది. అదే సమయంలో అక్రమ వలసలు మొదలయ్యాయి. ఆ అక్రమ వలసలు ఇంతవరకూ ఆగలేదు.

    మెక్సికో నుంచి శ్రామికుల వలస..: రెండో ప్రపంచ యుద్ధం కారణంగా శ్రామికుల కొరత ఏర్పడటంతో.. పొరుగు దేశమైన మెక్సికో నుంచి పనుల సీజన్లలో శ్రామికులు వచ్చి పనిచేసి వెళ్లడాన్ని అమెరికా ప్రోత్సహించింది. 1942 నుండి 1964 వరకూ 20 లక్షల మంది మెక్సికో నుంచి అమెరికాకు వలస వచ్చారు. వాళ్లలో అత్యధికులు అమెరికన్ల పొలాల్లో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేశారు. వారు అమెరికాలోనే స్థిరపడిపోకుండా చూసేందుకు.. వారి వేతనాల్లో పదో వంతును మెక్సికోకు పంపే ఏర్పాట్లు చేశారు. కానీ.. పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్లిన వారిలో చాలా మందికి తమ పదో వంతు వేతనాలు అందలేదు. అయినా చాలా మంది అమెరికాలోనే స్థిరపడిపోయారు. వారి వారసులకు అమెరికన్లు తమ వారిని ఉపయోగించుకున్న తీరు ఇప్పటికీ గుర్తుంది. ఆ దృక్కోణం నుంచే అమెరికన్ల పట్ల, అమెరికాలో అతిథి పనుల పట్ల వారి అభిప్రాయాలు ఉంటాయి.

    వృత్తి నిపుణుల కోటాతో ఆసియన్ల వలస: అమెరికా వలసల్లో ఆధునిక యుగం 1965లో మొదలైంది. అప్పటికి ఉధృతంగా వచ్చిన పౌర హక్కుల ఉద్యమం ఫలితంగా జాతుల ఆధారంగా వలసల కోటా విధానానికి స్వస్తి చెప్పారు. హార్ట్‌-సెల్లర్‌ చట్టం చేసి అమెరికాలో కీలక అవసరమున్న వృత్తి నైపుణ్యతలు ప్రాతిపదికగా వలస కోటాలు కేటాయించారు. దీంతో.. భారత్‌, చైనా, కొరియా, ఫిలిప్పీన్స్‌, పాకిస్తాన్‌ వంటి ఆసియా దేశాల నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి. ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య, దక్షిణ అమెరికాల నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. మొత్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ అమెరికా వలస రాజ్యంగా మారింది. ఈనాటికి కూడా.. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది వలసలు అమెరికాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి 2013 లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలస ప్రజల్లో 19.8 శాతం మంది అమెరికాలో నివశిస్తున్నారు.

    శ్వేతజాతీయుల జనాభా తగ్గుతోందనే ఆందోళన..: ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారిలో మూడో వంతు మంది వలసలే. దీంతో వలసలు తమను మించిపోతారన్న ఆందోళన అమెరికన్లలో పెరుగుతోంది. నిజానికి అమెరికాకు శతాబ్దం కిందటే వలస వచ్చి స్థిరపడ్డ లాటినోల (లాటిన్‌ అమెరికా దేశస్తులు) సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే శ్వేతజాతి అమెరికన్లు చాలా మంది ఈ లాటినోలు చాలా మంది కొత్తగా వలస వచ్చారని, అక్రమంగా వలస వచ్చారని నమ్ముతుంటారు. అలాగే.. విదేశాల్లో జన్మించిన అమెరికావాసులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతంగా ఉంటే.. 2015లో అది ఏకంగా 13.7 శాతానికి పెరిగింది. ఇది వలసలు పెరిగిన తీరుకు అద్దం పడుతోంది. అలాగే అమెరికా జనాభాలో శ్వేతజాతీయులు (మెక్సికో, లాటిన్‌ అమెరికా మూలాలున్న వారు కాకుండా) 1960 వరకూ 90 శాతంగా ఉండేది. ఇప్పుడది 62 శాతానికి పడిపోయింది. తెల్లవారు 2043 కల్లా జనాభాలో సగానికన్నా తగ్గిపోతారని జనాభా లెక్కల బ్యూరో అంచనా.

    (చదవండి: ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement