అక్రమ ‘వీసా’పై యూఎస్ సీరియస్
♦ స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ
♦ 306 మంది భారతీయ విద్యార్థులు
వాషింగ్టన్: వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే అక్రమంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ.. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన 306 మంది భారత విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో 306 మంది విద్యార్థులు వీసా గడువు పెంచుకునేందుకు దళారుల ద్వారా ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని, వీరంతా న్యాయబద్ధంగా విద్యార్థి వీసాలు తీసుకుని వచ్చినవారేనని ఇమ్మిగ్రేషన్ అధికారి మార్క్ టోనర్ తెలిపారు. గతవారం జరిగిన ఈ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా 11 మంది భారత సంతతి వారితోపాటు 21మంది దళారులను అరెస్టు చేశామన్నారు. ‘వీరందరి దగ్గర విద్యార్థి వీసాలే ఉన్నాయి. కానీ వీసా పొడగించుకునేందుకు అక్రమమార్గాల్లో ప్రయత్నించినందుకే వీరిపై చర్యలుంటాయి’ అని టోనర్ పేర్కొన్నారు.
అసలేం జరుగుతోంది? విద్యార్థి వీసాపై వెళ్లిన వారు వేర్వేరు కారణాలతో వీసా గడువు పెంచాలని సమయం ముగిసే 3-4 నెలల ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇదంతా చట్టబద్ధంగా జరిగే వ్యవహారమే కానీ,సరైన కారణాల్లేని పక్షంలో విద్యార్థులు మధ్యవర్తుల ద్వారా వీసా గడువు పెంచుకునేలా అక్రమమార్గాలను అన్వేషిస్తారు.
మధ్యవర్తులు మనుగడలో లేని వర్సిటీల పేరుతో విద్యార్థుల వీసా గడువు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తారు. దీంతో విద్యార్థి వీసాలపై వెళ్లిన వారికి మరింత కాలం అమెరికాలోనే ఉండి అక్కడే ఉద్యోగాలు వెతుక్కునేందుకు.. ఆర్థిక అవసరాలకోసం పనిచేసేందుకు వీలుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఇలాంటి దళారుల ఆటకట్టించేందుకు.. కొన్ని నకిలీ వర్సిటీలను సృష్టించి దళారులను ఆకర్షిస్తుంది. ఆ తర్వాత విద్యార్థి వీసా ఫ్రాడ్ చేసే వారిని పట్టుకుంటుంది. వారంరోజుల క్రితం ఇలా యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సృష్టించిన వర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే నకిలీ వర్సిటీలో చేరేందుకు చాలా మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో దళారులుగా ఇద్దరు తెలుగువారూ ఉన్నట్లు తేలింది.