అమెరికా ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు! | Students in jitters as US blacklists two varsities | Sakshi
Sakshi News home page

అమెరికా ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు!

Published Wed, Dec 23 2015 2:15 AM | Last Updated on Fri, Aug 24 2018 8:57 PM

అమెరికా ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు! - Sakshi

అమెరికా ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు!

* నాణ్యత కొరవడిన 150కి పైగా వర్సిటీలపై దృష్టిపెట్టిన అమెరికా ప్రభుత్వం
* కాలిఫోర్నియాలో 22 విశ్వవిద్యాలయాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం
* ఆ లిస్టులోని వర్సిటీల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్ని వెనక్కి పంపుతున్న వైనం
* ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపిన భారత విద్యార్థులు 25కు పైనే..

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అమెరికా చదువు ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు దాపురించాయి. పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విమానం ఎక్కుతున్న భారత విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే తిప్పి పంపుతున్నారు. విదేశీ విద్యార్థుల డిమాండ్ దృష్ట్యా కుప్పలు తెప్పలుగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన 150కి పైగా విశ్వవిద్యాలయాలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే దీనికి కారణం. సరైన అవగాహన లేకపోవడం, అమెరికా వర్సిటీలో సీటు వస్తే చాలనుకుంటూ వెళ్లడం వంటివి విద్యార్థుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
 
పెద్ద సంఖ్యలో విద్యార్థులు..
గత ఆరు నెలలుగా అమెరికా ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో నాణ్యత, బోధనా ప్రమాణాలపై దృష్టి పెట్టిం ది. అక్కడి కాలిఫోర్నియాలోని 22కు పైగా కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం. ఆ జాబితాలోని రెండు వర్సిటీల్లో చేరిన భారత, చైనా విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపుతున్నారు.

ఇప్పటికే వెయ్యి మందికి పైగా చైనా విద్యార్థులను వెనక్కి పంపగా.. 25 మంది భారత విద్యార్థులను తిప్పిపంపారు. సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంఎస్ డిగ్రీ కోసం భారత్ నుంచి 875 మంది విద్యార్థులు చేరినట్లు తెలిసింది. వారిలో దాదాపు 600 మంది ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. వారి భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
 
1,600 విశ్వవిద్యాలయాలు
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 1,600 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 300 ప్రభుత్వ రంగ వర్సిటీలు, మరో 600 వివిధ ట్రస్టులు, ప్రముఖ విద్యా సంస్థల అధీనంలో ఉన్నాయి. మిగతా 700 యూనివర్సిటీలు, వాటి స్థితిగతుల సమాచారం లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. సాధారణంగా అమెరికా వర్సిటీల్లో జీఆర్‌ఈ, టోఫెల్ ఉత్తీర్ణత, ఆ పరీక్షల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

కానీ ఈ 700 వర్సిటీలు జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలకు హాజరైతే చాలు అడ్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. ఎన్ని మార్కులు సాధించారన్నదానితో నిమిత్తం లేకుండానే ఎంఎస్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీఆర్‌ఈ లేకపోయినా సీటు ఇస్తామంటూ భారత్, అమెరికాలోని స్థానిక ప్రభుత్వాలు, వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. షికాగోకు చెందిన ఓ వర్సిటీ ఇలా  నిజామాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు జీఆర్‌ఈ లేకపోయినా అమెరికా వర్సిటీలో చేరవచ్చన్నది ఆ ఒప్పందం. ఇలాంటి వాటితోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టి ఇబ్బందుల పాలవుతున్నారు.
 
కన్సల్టెన్సీలకూ నజరానాలు
అమెరికాలో ఎంఎస్ డిగ్రీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అక్కడి కొన్ని విశ్వవిద్యాలయాలు భారత్‌లో కన్సల్టెన్సీలతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఒక్కో విద్యార్థి అడ్మిషన్‌కు 250 డాలర్లు (సుమారు రూ. 15 వేలు) కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. ఈ సొమ్ము కు ఆశపడిన పలు కన్సల్టెన్సీలు మంచి జీఆర్ ఈ, టోఫెల్ స్కోరు సాధించిన విద్యార్థులతో కూడా చెత్త వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తున్నాయి. కనీస మార్కులు వచ్చిన విద్యార్థులే వీటివల్ల అధికంగా నష్టపోతున్నారు.
 
ఆ వర్సిటీల జాబితా బయటపెట్టాలి
అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన వర్సిటీల జాబితాను బయటపెట్టకపోతే ఇలాంటి అనర్థాలు తప్పవని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఏయే వర్సిటీలను నిషేధిత జాబితాలో చేర్చారనే వివరాలను అమెరికా కాన్సులేట్ కార్యాలయాలకు అందించాలని... అలా చేస్తే ఆయా వర్సిటీలు జారీ చేసిన ఐ20 పత్రాల ఆధారంగా వచ్చిన వీసా దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు కలుగుతుందని అంటున్నారు.
 
‘బ్లాక్‌లిస్ట్’ వర్సిటీల వివరాలు ప్రకటిస్తాం: సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో బ్లాక్‌లిస్టులో పెట్టిన వర్సిటీలు, గుర్తింపు పొందిన వర్సిటీల జాబితాను అందచేస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. గుర్తింపులేని వర్సిటీల సర్టిఫికెట్లకు ప్రపంచంలో ఎక్కడా గుర్తింపు ఉండదని.. జాబితా విడుదల చేసే వరకు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లకుంటేనే మంచిదని సూచించారు.

అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సమస్యలను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు మంగళవారం సుష్మా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అశోక్‌గజపతిరాజు, రామ్మోహనరావు మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌లిస్టు జాబితా అందే వరకు విద్యార్థులు వేచి ఉండాలని కోరారు. ఇది ఎయిర్‌లైన్స్ సమస్య కాదని.. ఏ ఎయిర్‌లైన్స్ ద్వారా అమెరికా వెళ్లినా ఇమిగ్రేషన్‌లో ఆపేస్తారని స్పష్టం చేశారు.
 
బ్లాక్‌లిస్టులో లేము: సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ వర్సిటీలు

వాషింగ్టన్: తమ వర్సిటీలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టు పెట్టిందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రకటించాయి. ఈ వివరాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులకు పంపామని తెలిపాయి.

ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని... ఇమిగ్రేషన్ అధికారులకు సరైన వివరాలు చూపని పక్షంలోనూ తిప్పి పంపుతున్నారని వెల్లడించాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని యూఎస్ ఎంబసీ, ఎయిర్ ఇండియా అధికారులకు వర్సిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement