హెచ్-1బీ వీసా దరఖాస్తులకు అనుమతి | US to accept H-1B visas from today | Sakshi
Sakshi News home page

హెచ్-1బీ వీసా దరఖాస్తులకు అనుమతి

Published Wed, Apr 2 2014 3:01 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

హెచ్-1బీ వీసా దరఖాస్తులకు అనుమతి - Sakshi

హెచ్-1బీ వీసా దరఖాస్తులకు అనుమతి

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారు ఎంతో ఆతురతతో చూసే హెచ్-1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించేందుకు అమెరికా విస్తృత ఏర్పాట్లు చేసింది. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభించగా.. ఏప్రిల్ 7 నాటికి రెండు రకాల పరిమితులకు సరిపోయేంత సంఖ్యలో దరఖాస్తులు రావచ్చని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ర్యాండమ్ (అక్కడక్కడ) పద్ధతిలో లాటరీ ద్వారా దరఖాస్తులను ఎంపిక చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. తిరస్కరించిన దరఖాస్తులను ఫీజుతో సహా వాపసు చేస్తారని యూఎస్‌సీఐఎస్ అధికారులు వెల్లడించారు. కాగా అమెరికా విధించిన పరిమితి ప్రకారం.. అక్టోబరు 1, 2014 నుంచి ప్రారంభమయ్యే 2015 ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా 65 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే యూఎస్‌సీఐఎస్ కేటాయించనుంది. అయితే యూ ఎస్ మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకు మించిన ఉన్నత విద్య ఉన్న తొలి 20 వేల మందికి 65 వేల పరిమితి నుంచి మినహాయింపు లభించనుంది.
 
 ఎల్-1 వీసాల తిరస్కారం భారతీయులకే ఎక్కువ...
 నాన్-ఇమ్మిగ్రెంట్ ఎల్-1 వీసాల కోసం చేసే దరఖాస్తుల్లో ఎక్కువగా భారతీయుల దరఖాస్తులే తిరస్కరణకు గురవుతున్నాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఓ నివేదికలో వెల్లడించింది. 2009 ఆర్థిక సంవత్సరంలో 1,640 మంది భారతీయుల ఎల్-1బీ పిటిషన్లను యూఎస్‌సీఐఎస్ తిరస్కరించిందని, ఆ సంఖ్య అంతకుముందు 9 ఆర్థిక సంవత్సరాలలో తిరస్కరించిన (1,341) కన్నా కాస్త ఎక్కువేనని ఆ సంస్థ పేర్కొంది. విదేశాల్లో కనీసం ఏడాది పనిచేసిన నిపుణులైన తమ ఉద్యోగులను ఆయా కంపెనీలు అమెరికాకు పంపేందుకు ఎల్-1బీ వీసాలు అవసరం. అయితే కెనడా, బ్రిటన్, చైనా వంటి అనేక దేశాలతో పోల్చితే భారతీయులకే ఈ వీసాలను ఎక్కువగా తిరస్కరిస్తున్నారని ఫౌండేషన్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement