ముంబై : అమెరికా అంటే ఒకప్పుడు ఉన్నత విద్యకు, ఉపాధి అవకాశాలకు కల్పతరువు వంటిది. ఉన్నత విద్య, ఉపాధి కోసం మనలో చాలా మంది అమెరికా వెళ్లాలని ఉవ్విళ్ళూరిన వారున్నారు. అప్పుడు అనుకున్నదే తడవుగా అమెరికా వెళ్లడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారాయి. ప్రస్తుతం అక్కడ వీసా నిబంధనలు, వలస విధానం ఎంత కఠినంగా మారాయో ఈసారి మన విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్యను చూస్తే అర్థం అవుతుంది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వేర్వేరు దేశాల వ్యక్తులకు జారీ చేసే వీసాల సంఖ్య 2016లో 5.02లక్షలు ఉండగా 2017, సెప్టెంబరు 30 నాటికి ఈ సంఖ్య 16శాతం తగ్గి 4.21లక్షలకు పడిపోయింది. 2016లో 65,257మంది భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేయగా 2017 నాటికి ఆ సంఖ్య 47,302కు తగ్గింది.
ప్రపంచవ్యాప్తంగా...
2017 సెప్టెంబర్ 30నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.93లక్షల మంది విద్యార్థులకు ఎఫ్1 కేటగిరికి సంబంధించిన వీసాలను, వారి కుటుంబ సభ్యులకు(జీవిత భాగస్వాములు, పిల్లలకు) ఎఫ్2 కేటగిరికి సంబంధించిన వీసాలను మంజూరు చేసింది. వీరిలో 68శాతం ఆసియా ఖండానికి చెందిన వారే ఉన్నారు. వారిలోనూ 40శాతం మంది భారత్, చైనాలకు చెందినవారు కావడం విశేషం. 2017లో 2.86లక్షల వీసాలను ఆసియా దేశాల వారికి జారీ చేశారు. 2016తో పోలిస్తే ఇది 20శాతం తగ్గింది.
గతంలో....
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు విద్యార్థులకు జారీ చేసే వీసాల సంఖ్య ఎక్కువగా ఉండేది. 2015లో ఈ సంఖ్య 6.50లక్షలు. గత సంవత్సరం నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్1-బీ దరఖాస్తుదారులు వర్క్ వీసా, అమెరికా పౌరసత్వం, వలస సేవల ప్రయోజనాలు పొందడం కఠినంగా మారింది. ప్రస్తుంతం వారికి చెల్లిస్తున్న వేతనాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అమెరికా వెళ్లలనుకునే ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం అక్కడ ఉద్యోగం చేయాలంటే ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించాలి అనే నిభందన ఉండటం . వీటన్నిటి ఫలితంగా ఇంతకాలం అమెరికా...అమెరికా అని పలవరించిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఆస్ట్రేలియా,కెనడా వైపు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment