కంప్యూటర్తో మతిమరుపు దూరం!
వాషింగ్టన్: కనీసం వారానికి ఒకసారి కంప్యూటర్ను వాడటం వలన వృద్ధులలో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కంప్యూటర్ వాడకం, చదవటం, రాయటం లాంటి చర్యల ద్వారా మెదడు ఉత్తేజితమౌతుందని, తద్వారా మెదడు క్రియాశీలకంగా పనిచేస్తూ మానసికపరమైన సమస్యలు తగ్గిపోతున్నాయని అమెరికాకు చెందిన మయో క్లినిక్ వెల్లడించింది.
మలి వయసులో ఎదుర్కొనే అనేక మానసిక సమస్యలకు ప్రధాన కారణం మెదడును క్రియాశీలకంగా ఉంచే మానసిక కార్యకలాపాల్లో పాల్గొనకపోవటమే అని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రెల్ రోచ్ తెలిపారు. కంప్యూటర్ను వారానికి ఒక సారి వాడటం ద్వారా మానసిక రుగ్మతల భారీన పడే అవకాశం 42 శాతం తగ్గుతోందని, మేగజైన్లు చదవటం, సామాజిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించే వారిలో మతిమరుపు అవకాశం 30 శాతం మేర తగ్గుతోందని ఆయన తెలిపారు.