గుండె జబ్బు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారినీ చుట్టుముడుతోంది. ఇటీవలికాలంలో యువతలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఒక వైద్య అధ్యయనంలోని వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైనవన్నీ హృదయ ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుంటాయి. అయితే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మద్యం, ధూమపానానికి దూరం
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం అనేది ధమనుల పనితీరును దెబ్బతీసుస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును గణనీయంగా పెంచుతుంది.
అలసటపై నిర్లక్ష్యం వద్దు
గుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనవి తీవ్రమైన గుండె సమస్యలకు సూచన కావచ్చు. ఇటువంటి సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతంగా అలసిపోయినట్లు అనిపించడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
నిద్రలేమిని విస్మరించొద్దు
నిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజూ రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. చక్కని నిద్ర పలు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.
ఒత్తిడిని జయించండి
అధిక ఒత్తిడి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
వ్యాయామం తప్పనిసరి
ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాయామం చేసే అలవాటు శరీర బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment