ప్రమాదాలకు దారితీసే నిద్ర అలవాట్లు..
న్యూయార్క్ః నిద్రలేమి, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఆరునుంచి, ఎనిమిది గంటలు నిద్రపోవాలని, లేదంటే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆరు గంటలకంటే అతి తక్కువగా నిద్రపోవడం ద్వారా అనేక ఆనారోగ్యాలు దరిచేరడంతోపాటు మరణాలు సైతం సంభవిస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు.
కలత నిద్ర, నిద్రలో ఆటంకాలు అనేక ప్రమాదాలకు దారి తీస్తాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. చాలీ చాలని నిద్రతోపాటు, అత్యధికంగా కానీ, అతి తక్కువగా కానీ నిద్రపోవడం కడుపులో మంట వంటి ఇతర ఆనారోగ్యాలకు దారి తీస్తాయని తాజా అధ్యయనాలద్వారా కనుగొన్నారు. తగిన నిద్ర లేకపోవడం అనేది ఓ మహమ్మారి వంటిది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భావిస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామంతోపాటు నిద్ర ఎంతో అవసరమని అమెరికా లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు.
నిద్రాభంగం, నిద్రలేమి శరీరంలో అధిక కొవ్వును కలుగజేయడం, కడుపులో మంటను సృష్టించడంతోపాటు, ప్రవర్తనపై కూడ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇర్విన్ చెప్తున్నారు. ఇన్ ఫ్లమేషన్.. శరీరంలోని సి-రియాక్టివ్ ప్రొటీన్ ను, ఇంటర్ల్యూకిన్ 6 తోపాటు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల్లో తెలిపారు. అత్యధిక, అత్యల్ప నిద్ర కూడా శరీరంలో సీఆర్పీని పెంచుతాయని, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కనీసం 6 నుంచీ 8 గంటల వరకూ నిద్రపోవాలని అధ్యయనకారులు చెప్తున్నారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 50000 మంది భాగస్వాములయ్యారని, అంతేకాక పలు వైద్య చికిత్సా వ్యాసాలపై కూడా విశ్లేషణాత్మక అధ్యయనాలు నిర్వహించినట్లు ఇర్విన్ తెలిపారు. నిద్ర అలవాట్ల ఆధారంగా చికిత్సలు అందించి పలు అనారోగ్యాలను తగ్గించవచ్చని పరిశోధకులు నిర్థారించారు.