Too
-
ఆ ఏటీఎంలు కూడా నిండుకున్నాయట!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ సెగ పార్లమెంట్ ఆవరణలోని ఏటీఎం సెంటర్లను కూడా తాకింది. ఒక పక్క శీతాకాల పార్లమెంట్ సమావేశాల ఉభయ సభల్లోనూ ఆపరేషన్ బ్లాక్ మనీ ప్రకంపనలు రేపుతోంది. మరోపక్క పార్లమెంట్ బయట ఏటీఏం కేంద్రాలకు కరెన్సీ కష్టాలు చుట్టుకున్నాయి.. పార్లమెంటు ఆవరణలోని రెండు ఏటీఎంలు గురువారం నగదులేక వెలవెలబోయిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు, కొంతమంది జర్నలిస్టులు ఇక్కడున్న రెండు ఏటీఎం కేంద్రాలవద్ద బారులు తీరారు. కానీ అంతలోనే క్యాష్ అయిపోవడంతో అందరూ నీరసించారు. అయితే ఆర్బీఐ కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయానికి అతి సమీంపలోని ఏటీఏం కేంద్రాలలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగిలిన ఏటీఎం సంగతి ఏంటన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారంపై సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే ఏటీఎంలలో ఉంటుందంటూ చమత్కరించడం విశేషం. కాగా నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటనతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. పెద్దనోట్ల రద్దుతో ఏటీఎం సెంటర్ల దగ్గరకు బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడినా చివరకు నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. మరోవైపు నగదు నిల్వలు సరిపడినంత ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ బీఐ, ఆర్థిక శాఖ భరోసా ఇస్తున్న సంగతి తెలిసిందే. -
పాక్ మార్కెట్లకు భారత్ దెబ్బ
కరాచీ: భారత దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పాకిస్థాన్ భూభాగంపై భారత సైన్యం దాడుల నేపథ్యంలో కరాచీ స్టాక్ మార్కెట్ 100 ఇండెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో 532 పాయింట్లు పతనమైన 40,328.93 స్థాయికి పడిపోయింది. అనంతరం భారత సైన్యం దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దాడులను ఖండించడంతో కోలుకున్నాయి. తాము శాంతి కావాలని కోరుకుంటున్నామని, తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇవ్వడంతో కొంత తెప్పరిల్లాయి. అయితే భారత్ నుంచి ఎలాంటి సర్జికల్ దాడులు జరగలేదని, అర్థరాత్రి భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికుల మరణించారని పాక్ ఖండించినప్పటికీ పెద్దగా ఫలితం లేదు. కాగా పాక్ భూభాగంలో భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రైక్స్ చేశామనీ, ఆపరేషన్ ముగిసిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సమాజాన్ని ప్రభావితం చేసే శతకం కల్పవల్లి శతకం
ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్ జోగిపేట :సమాజాన్ని ప్రభావితం చేసే శతకం కల్పవల్లి శతకమని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. సోమవారం జోగిపేటలో డాకూరు ఉన్నత పాఠశాల భాషోపాధ్యాయుడు కె.కృష్ణ రచించిన కల్పవల్లి శతకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీఆర్టీయూ మండల శాఖక అధ్యక్షుడు ఏ.మాణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి శతక సాహిత్యానికి ఉందని, వేమన కాలం నుంచి కూడా విభిన్న ఛందోవృత్తుల ద్వారా పద్యాలతో మార్పులపై కవులు ఆరాటపడుతుంటారన్నారు. ఇటీవల కాలంలో మాధ్యమాలు పెరిగిపోవడంతో శతకాలకు ఆదరణ లేకుండా పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ శతక రచన ఈరోజుల్లో అరుదని, ఆ ప్రయత్నం చేస్తున్న కృష్ణను అభినందిస్తున్నానన్నారు. శతకంలో ఉన్న పద్యాలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సురోత్తంరెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో వస్తున్న మాసపత్రికలో కల్పవల్లిలోని ఐదు శతకాలను అచ్చువేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణశీల, డిప్యూటీ డీఈఓ పోమ్యానాయక్, జిల్లా పీఆర్టీయూ అ«ధ్యక్షుడు నర్సింలు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాణయ్య, నరోత్తంలు పాల్గొన్నారు. -
ప్రమాదాలకు దారితీసే నిద్ర అలవాట్లు..
న్యూయార్క్ః నిద్రలేమి, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఆరునుంచి, ఎనిమిది గంటలు నిద్రపోవాలని, లేదంటే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆరు గంటలకంటే అతి తక్కువగా నిద్రపోవడం ద్వారా అనేక ఆనారోగ్యాలు దరిచేరడంతోపాటు మరణాలు సైతం సంభవిస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. కలత నిద్ర, నిద్రలో ఆటంకాలు అనేక ప్రమాదాలకు దారి తీస్తాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. చాలీ చాలని నిద్రతోపాటు, అత్యధికంగా కానీ, అతి తక్కువగా కానీ నిద్రపోవడం కడుపులో మంట వంటి ఇతర ఆనారోగ్యాలకు దారి తీస్తాయని తాజా అధ్యయనాలద్వారా కనుగొన్నారు. తగిన నిద్ర లేకపోవడం అనేది ఓ మహమ్మారి వంటిది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భావిస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామంతోపాటు నిద్ర ఎంతో అవసరమని అమెరికా లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. నిద్రాభంగం, నిద్రలేమి శరీరంలో అధిక కొవ్వును కలుగజేయడం, కడుపులో మంటను సృష్టించడంతోపాటు, ప్రవర్తనపై కూడ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇర్విన్ చెప్తున్నారు. ఇన్ ఫ్లమేషన్.. శరీరంలోని సి-రియాక్టివ్ ప్రొటీన్ ను, ఇంటర్‌ల్యూకిన్ 6 తోపాటు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల్లో తెలిపారు. అత్యధిక, అత్యల్ప నిద్ర కూడా శరీరంలో సీఆర్పీని పెంచుతాయని, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కనీసం 6 నుంచీ 8 గంటల వరకూ నిద్రపోవాలని అధ్యయనకారులు చెప్తున్నారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 50000 మంది భాగస్వాములయ్యారని, అంతేకాక పలు వైద్య చికిత్సా వ్యాసాలపై కూడా విశ్లేషణాత్మక అధ్యయనాలు నిర్వహించినట్లు ఇర్విన్ తెలిపారు. నిద్ర అలవాట్ల ఆధారంగా చికిత్సలు అందించి పలు అనారోగ్యాలను తగ్గించవచ్చని పరిశోధకులు నిర్థారించారు. -
మహిళలే ఎక్కువ 'ఆ పదాలు' వాడుతున్నారు!
లండన్ః సాంకేతిక విప్లవంలో భాగంగా స్మార్ట్ ఫోన్ల తయారీ భారీగా పెరిగిపోయింది. దీంతో పాటే ఇంటర్నెట్ సౌకర్యంకూడ అందుబాటులోకి రావడంతో సామాజిక మాధ్యమాల వాడకం కూడ ఎక్కువై పోయింది. తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించేందుకు, ప్రజలతో పంచుకునేందుకు ఆయుధంగా సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటున్నారు. అయితే ఆయా మాధ్యమాల్లో ఎక్కువగా సెక్స్ సంబంధిత పదాలను, బూతు పదాలను మగవారే ఎక్కువగా పోస్ట్ చేస్తారన్నఅభిప్రాయాన్ని పరిశోధకులు కొట్టి పారేశారు. బ్రిటిష్ ట్విట్టర్ యూజర్లపై పరిశోధనలు జరిపిన అధ్యయన కారులు ట్విట్టర్లో సెక్స్ పదాలను ఎక్కువగా మహిళలే పోస్టు చేస్తున్నట్లు కనుగొన్నారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ యూజర్లపై బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం అధ్యయనాలు నిర్వహించింది. ముఖ్యంగా ట్విట్టర్ లో స్త్రీలపై ద్వేషం, దుర్వినియోగం వంటి విషయాలను విశ్లేషించింది. మగవారితో పాటు మహిళలు కూడ అభ్యంతరకర, సెక్స్ సంబంధిత పదాలు వాడుతున్నారని, అందులో మహిళలే ఎక్కువగా సెక్స్ పదాలు పోస్ట్ చేస్తున్నారని బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం తెలుసుకుంది. మూడు వారాలపాటు వినియోగదారులపై జరిపిన అధ్యయనాల ద్వారా ఈ సరికొత్త విషయాలను కనుగొన్నారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన సుమారు 2,00,000 ట్వీట్స్ లో ఒకేరకమైన పదాలను దాదాపు ఒకే సమయంలో 80,000 వేల మంది వాడినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మొత్తం 6500 ట్విట్టర్ వినియోగదారులు సెక్సియెస్ట్ ట్వీట్టే లక్ష్యంగా 10,000 వరకు ట్వీట్లు చేసినట్లు గుర్తించారు. సామాజిక నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కూడ సెక్సియస్ట్ పదాల వాడకంతోపాటు, జాత్యాహంకరం, దుర్వినియోగం వంటి విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల ఓ బికినీ ధరించిన మోడల్ శరీర భాగాలను ప్రదర్శించే ప్రకటనను చూపించి క్షమాపణలు చెప్పుకుంది. -
డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!
పెళ్ళి నిశ్చితార్థానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఓ యువతిని పెళ్ళికి ప్రపోజ్ చేసిన యువకుడు ఉంగరం చేయిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే చేయించాడు కూడా. కానీ ఉంగరంలోని డైమండ్ చిన్నదైందంటూ ఏకంగా పెళ్ళికే ససేమిరా అందా మగువ. ఎంగేజ్ మెంట్ రింగ్ లో డైమండ్ చిన్నదైనందుకు పెళ్ళినే నిరాకరించింది. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. పాపం ఆ ప్రేమికుడు... ప్రేయసిని ఉంగరంతో ఆశ్చర్యపరచాలనుకున్నాడు. పార్టీకి పిలిచి డైమండ్ రింగ్ బహూకరించి పెళ్ళి చేసుకుందామన్న ప్రపోజల్ తో సిద్ధంగా వచ్చాడు. తీరా ఆమె ఉంగరంలో చిన్న డైమండ్ ఉందంటూ పెళ్ళినే నిరాకరించడంతో వందలమంది డ్యాన్సర్లు ముందే మోకరిల్లాడు. ఎంతగానో బతిమలాడాడు. అయితేనేం వజ్రంలాంటి కుర్రాడికన్నా ఉంగరంలోని వజ్రానికే ఆ చిన్నది ప్రాముఖ్యతనిచ్చింది. పెళ్ళి గిళ్ళి జాంతానై.. అంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది. నైరుతి చైనా రాజధాని, సుచియాన్ ప్రావిన్స్ నగరంలో ఆమె చేస్తున్న చెంగ్డూ నృత్యాన్ని చూసి ఆ ప్రేమికుడు ఫిదా అయిపోయాడు. ఆమె వెంటపడి తన ప్రేమను తెలిపాడు. అలాగే పెళ్ళికి కూడ ప్రపోజ్ చేశాడు. వజ్రం ఉంగరం ఇస్తామని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే తన బాయ్ ఫ్రెడ్ వజ్రం ఉంగరాన్ని తెచ్చివ్వడాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. బాక్స్ నుంచి ఉంగరం బయటకు తీశాడు. అంతే.. ఆమె ముఖం మాడిపోయింది. ఏంటీ ఇంత చిన్న వజ్రమా అంటూ ఉంగరంతోపాటు అతడి ప్రపోజల్ నూ తిప్పి కొట్టింది. అతడితో మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయింది. జరిగిన తతంగంపై ఆ ప్రియురాలు 'వియ్ ఛాట్' లో తన స్నేహితురాలితో సంభాషించింది. ఆ తర్వాత ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ గా మారి... ఆన్ లైన్ లో లీకయింది. ఓ కథలా పబ్లిష్ అయ్యింది. తనకు ప్రపోజ్ చేసినప్పుడు వన్ కేరెట్ వజ్రంతో ఉంగరం చేయిస్తానన్నాడని, తీరా నిశ్చితార్థానికి అంత చిన్న వజ్రం ఉంగరం ఇవ్వడంలో అతని ఉద్యేశ్యం ఏమిటంటూ ఆమె తన అభద్రతా భావాన్ని మెసేజ్ లో వ్యక్త పరిచింది. అతడు తనగురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఫ్రెండ్ ''బాధపడకు నీకోసం మరో పెద్ద రింగ్ ఎదురు చూస్తూ ఉండి ఉంటుందిలే'' అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా మెసేజ్ ల ద్వారా విషయం లీక్ అవడంతో ఆ ప్రేమికుల కథ బట్టబయలైంది. సో అబ్బాయిలూ ప్రపోజ్ చేసేంముందు కాస్ల ఆలోచించి మరీ వాగ్దానాలు చేయాలని మర్చిపోకండి.