ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్
జోగిపేట :సమాజాన్ని ప్రభావితం చేసే శతకం కల్పవల్లి శతకమని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. సోమవారం జోగిపేటలో డాకూరు ఉన్నత పాఠశాల భాషోపాధ్యాయుడు కె.కృష్ణ రచించిన కల్పవల్లి శతకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీఆర్‌టీయూ మండల శాఖక అధ్యక్షుడు ఏ.మాణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి శతక సాహిత్యానికి ఉందని, వేమన కాలం నుంచి కూడా విభిన్న ఛందోవృత్తుల ద్వారా పద్యాలతో మార్పులపై కవులు ఆరాటపడుతుంటారన్నారు.
ఇటీవల కాలంలో మాధ్యమాలు పెరిగిపోవడంతో శతకాలకు ఆదరణ లేకుండా పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ శతక రచన ఈరోజుల్లో అరుదని, ఆ ప్రయత్నం చేస్తున్న కృష్ణను అభినందిస్తున్నానన్నారు. శతకంలో ఉన్న పద్యాలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సురోత్తంరెడ్డి మాట్లాడుతూ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో వస్తున్న మాసపత్రికలో కల్పవల్లిలోని ఐదు శతకాలను అచ్చువేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణశీల, డిప్యూటీ డీఈఓ పోమ్యానాయక్, జిల్లా పీఆర్‌టీయూ అ«ధ్యక్షుడు నర్సింలు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాణయ్య, నరోత్తంలు పాల్గొన్నారు.