'తప్పు చేశాను... క్షమించండి'
మియామి(ఫ్లోరిడా): అమెరికాలోని మియామిలో మద్యం మత్తులో హంగామా సృష్టించిన భారత సంతతికి మహిళా డాక్టర్ రామకి సూన్(30) క్షమాపణ కోరింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్ పై ఆమె దాడి చేసిన వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేయడంతో వివరణయిచ్చింది.
జాక్సన్ హెల్త్ సిస్టమ్ లో న్యూరాలజీ రెసిడెంట్ గా పనిచేస్తున్న రామకి సూన్(30) వారం క్రితం మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసింది. అతడు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయింది. విచక్షణారహితంగా బాదేసింది. తర్వాత కారులోకి ఎక్కి పేపర్లు, ఇతర వస్తువులు బయటకు విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆమె తప్పు ఒప్పుకుంది. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ఏబీసీ న్యూస్ తో చెప్పింది. ఈ ఘటనతో తాను చాలా మందిని బాధ పెట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.
కుంగుబాటు కారణంగానే అలా ప్రవర్తించానని, తన జీవితంలోనే అది దుర్దినమని పేర్కొంది. దాడి జరిగిన రోజున తన తండ్రి ఆస్పత్రి పాలయ్యారని, తన ప్రియుడి నుంచి విడిపోయానని వెల్లడించింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం శ్రేయస్కరం కాదని భావించి తన కారును అక్కడే వదిలేశానని తెలిపింది. అదే సమయంలో ఉబర్ క్యాబ్ రావడంతో ఈ ఉదంతం చోటు చేసుకుందని వివరించింది. అయితే ఉబర్ క్యాబ్ ను పిలిచిన మరో ప్రయాణికుడు అక్కడ జరిగిందంతా సెల్ ఫోన్ తో వీడియో తీసి యూట్యాబ్ లో పెట్టాడు.
ఈ వీడియోతో తన కుటుంబ పరువు రచ్చకెక్కిందని రామకి సూన్ వాపోయింది. జరిగిన దానికి తనదే బాధ్యత అని, తనను మన్నించాలని వేడుకుంది. ఆమెను వైద్య విధుల నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్ తొలగించి సెలవుపై పంచించింది. అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.