ఆ శాడిస్ట్ ఓ మెడికో!
తన ఇంటి టెర్రస్ పై నిలబడి, కుక్కను పిట్టగోడపై నిలబెట్టి, నవ్వుతూ వీడియోకి పోజివ్వడమే కాదు.. దాన్ని మేడపైనుంచి విసిరేసి దారుణంగా ప్రవర్తించిన సదరువ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలోని కుక్కను టెర్రస్ పై నుంచి దూరంగా విసిరేసిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సదరు శాడిస్ట్ ఓ వైద్యవిద్యార్థి!
కుక్కను కిందపడేసిన శాడిస్టును చెన్నైకి చెందిన మెడికో గౌతమ్ గా చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇతను చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన తమకు గౌతమ్ స్నేహితుడొకరు ఇచ్చిన సమాచారం కీలకంగా మారిందని పేర్కొన్నారు. బిల్డింగ్ పై నుంచి కుక్కను కిందికి తోసేసిన వీడియో వైరల్ కావడంతో అందులో ఉన్న గౌతమ్ ను అతని క్లాస్ మేట్ గుర్తుపట్టి పోలీసులకు ఉప్పందించడంతో శాడిస్ట్ జాడ తెలిసినట్లయింది. గౌతమ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో చిత్రీకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
చేస్తున్నది రాక్షస క్రీడ అయినా ఎంతో ఆనందంగా నవ్వుతూ గౌతమ్ కెమెరాకు పోజిచ్చిన తీరు అందర్నీ విస్మయపరుస్తోంది. ఆ మూగ జంతువు ప్రాణ భయంతో అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్టో మోషన్ లో వీడియో తీసి ప్రకృతికి విరుద్ధంగా అతడు ప్రవర్తించిన తీరు... చూపరులను అందోళన పరుస్తోంది. ఓ మూగ ప్రాణం పట్ల అతడు చూపించిన కర్కశత్వానికి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలోని శాడిస్టు ఎవరో తెలుసుకొని, తగిన శిక్ష విధించాలని ఫేస్ బుక్ వినియోగదారులతోపాటు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మనుషుల మనోభావాలు, ప్రవర్తన.. ఒక్కోరివీ ఒక్కోలా ఉంటాయి. అయితే అవి ఇతరులకు ఎలాంటి హాని తలపించనివైతే నష్టంలేదు. వారి ప్రవర్తన తేడాగా ఉన్నపుడు మాత్రం సమాజానికి, ఇతరులకు ఎంతో నష్టాన్ని చేస్తుంది. అటువంటి వారిపట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మెడికో గౌతమ్ అదే కోవకు చెందిన వ్యక్తి అని కాదనగలమా!