అక్కడ రేప్‌లు నిత్యకృత్యం
గ్వాటెమాల సిటీ: ఇక్కడ బాల్యం పురటి నొప్పులు పడుతోంది. తెలిసీ తెలియని వయస్సులో రక్తస్రావం అవుతోంది. పట్టుమని పదేళ్లుకూడా నిండని పిల్లలు తల్లులవుతున్నారు. మగవాళ్ల కామవాంఛకు బాలికల నిండు నూరేళ్ల జీవితాలు బలవుతున్నాయి. ఆ పిల్లలకు తండ్రులెవరోకాదు. 90 శాతం కేసుల్లో అన్నదమ్ములు, మేనమామలు, తండ్రులే ఈ దారుణాలకు పాల్పడుతుండగా, కేవలం పదిశాతం కేసుల్లో పక్కింటివారు. పరిచయస్తులు బాధ్యులవుతున్నారు. మొత్తం రేప్ కేసుల్లో 30 శాతం కేసులు తండ్రులు చేసినవే కావడం దిగ్భ్రాంతికరం. జుగుప్సకరం. లాటిన్ అమెరికా దేశంలోని గ్వాటెమాలలో నేడు కళ్లకు కడుతున్న ప్రత్యక్ష పరిస్థితులివి.
అమెరికా పాశవిక చర్యల పరిణామక్రమమే ఈ దారుణ పరిస్థితులకు కారణమంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1990వ దశకం వరకు 36 ఏళ్లపాటు గ్వాటె మాలలో కొనసాగిన అంతర్యుద్ధం సందర్భంగా అమెరికా సీఐఏ అండదండలతో రెచ్చిపోయిన రైట్ వింగ్ జనరల్స్ అకృత్యాల ఫలితమే ఇది. అంతర్యుద్ధం సందర్భంగా లక్షమందికి పైగా బాలికలపై రేప్‌లు జరిగాయి. ఇప్పుడా రేప్‌లే గ్వాటెమాలలో సామాజిక సంస్కృతిలో భాగంగా మారిపోయింది. పిల్లలు, పిల్లల పిల్లలను పోషించలేని పరిస్థితుల్లో వారిని వయస్సు మీరిన వారికీ, వృద్ధులకు తల్లిదండ్రలు అమ్మేస్తున్నారు. నిత్యకృత్యంగా మారిన రేప్ కేసుల్లో ఇదంతా సర్వసాధారణమే అన్నట్టుగా వారు బతుకుతున్నారు.
ఈ పరిస్థితుల గురించి తెలిసి చలించిపోయిన స్వీడన్‌కు చెందిన ఫొటో జర్నలిస్ట్ లిండా ఫొర్‌సెల్ గత రెండేళ్లకాలంలో పలుసార్లు గ్వాటెమాలను సందర్శించి వెల్లడించిన విషయాలివి. ఆమె పిన్నవయస్సులోనే తల్లులైన ఎంతోమంది పిల్లల విషాధ గాధలను తెలుసుకున్నారు. వారిని ఫొటోలను తీశారు. ఓ టీనేజ్ పిల్లను పబ్లిక్‌గా చెట్టుకుకట్టేసి 53 ఏళ్ల వృద్ధుడు రేప్ చేసిన గాధలున్నాయందులో. ఆ ఫొటో జర్నలిస్ట్ సేకరించిన లెక్కల ప్రకారం 2014లో 14 ఏళ్లలోపు తల్లులైన పిల్లలు 5,100. అంతకుముందు అలాంటి తల్లుల సంఖ్య 4,354. 2012 సంవత్సరంలో దాదాపు రెండు వేల మంది పిల్లలు తల్లులయ్యారని, వారిలో పదేళ్ల పిల్లలు కూడా ఉన్నారని ఆమె తెలిపారు.
రేప్ కేసుల్లో పదిశాతం కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదు కావని, అయిన కేసుల్లో కూడా పది శాతం మందికి కూడా శిక్షలు పడవని లిండా మీడియాకు తెలిపారు. గ్వాటెమాలలో మగవాళ్లంతా ఆడవాళ్లను ఆస్తులుగా పరిగణించడం, వారిపై సర్వాధికారాలు ఉన్నాయనే అహంభావాన్ని నరనరాల్లో జీర్ణించుకోవడం వల్లనే ఇలా జరుగుతోందని చెప్పారు. 14 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లి చేయకూడదనే చట్టం ఉన్నప్పటికీ రేప్‌ల కారణంగా తల్లులవుతున్న వాళ్లు, తల్లయిన కారణంగా 14 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లవుతున్న సంఘటనలే ఎక్కువ. తల్లులైన పిల్లలకు ఇప్పటికీ గర్భ నిరోధక పద్ధతుల గురించి పెద్దగా తెలియదట. ఈ దారణ పరిస్థితులను అరికట్టేందుకు సామాజిక చైతన్యం, కఠిన చట్టాలను తీసుకరావాల్సిన గ్వాటెమాల ప్రభుత్వం గతవారం ఆడ పిల్లల పెళ్లి వయస్సును 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచుతూ చట్టాన్ని సవరించి చేతులు దులుపుకొంది.