
ఫేస్‌బుక్‌లో నిప్పుపెట్టిన 'క్యాచ్ యువర్ థీఫ్'
లిమా: పెరు దేశ ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. 'క్యాచ్ యువర్ థీఫ్' పేరిట వారు సామాజిక వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్'లో చేపట్టిన ఉద్యమం ఇప్పుడు కాస్త చేతులుదాటి పోయింది. దొంగలను, పిక్ పాకెటర్స్‌ను పట్టుకొని స్తంభాలకు కట్టేస్తున్నారు. గుడ్డలూడదీసి చితక బాదుతున్నారు. రక్తం కక్కుకునేలా చేతికి అందుబాటులోవున్న వస్తువునల్లా తీసుకొని కొడుతున్నారు. ఆడ, మగ తేడా లేకుండా బట్టలూడదీసి మెడకు ‘నేను దొంగను’ అనే బోర్డును తగిలించి నడి వీధిలో ఊరేగిస్తున్నారు. చీమల పుట్టలపై కాళ్లు కదలకుండా నిలబెట్టి ఒళ్లంతా చీమలు కుడుతుంటే చోద్యం చూస్తున్నారు. ఈ శిక్షలన్నింటిని ఎవరికి వారు కెమెరాలతో, మొబైల్స్‌తో వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు.
పెరులోని హుహాంకయోలో ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ సామాజిక ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. 'క్యాచ్ యువర్ థీఫ్ అండ్ లీవ్ హిమ్ ప్యారలైజ్డ్, క్యాచ్ యువర్ థీఫ్ అండ్ కట్ హిజ్ హాండ్స్, క్యాచ్ యువర్ థీఫ్ క్యాస్ట్రేట్ హిమ్' నినాదాలతో వెర్రితలలు వేస్తోంది. ఇప్పుడు దొంగలకు శిక్షలు విధించేందుకు ఫేస్‌బుక్ యూజర్ల బృందాలు కూడా తయారయ్యాయి. ఈ బృందాలు కేవలం దొంగలకు శిక్ష విధించడానికే పరిమితం కావడం లేదు. వేశ్య గృహాలపై దాడులు చేస్తున్నాయి. వేశ్యలను, విటులను నడి వీధుల్లోకి ఈడ్చి చితక్కొడుతున్నాయి. ఫర్నీచర్‌ని నడి వీధులో వేసి తగులబెడుతున్నాయి. అంతేకాకుండా వివాహేతర సంబంధాలున్నాయని తెలిసిన ప్రతి ఇంటిపై దాడులు జరుపుతూ ‘మోరల్ పోలిసింగ్’ పాల్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో ఏ పాపం తెలియని అమాయకులు కూడా బలైపోతున్నారు.
ఇదే సరైన అవకాశం అనుకున్న సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఇప్పుడు రంగప్రవేశం చేశాయి. తాము శత్రువులనుకున్న వారిపై 'దొంగ' అని ముద్రవేసి చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పగలూ, ప్రతికారాలు తీర్చుకోవడానికి ఈ ఉద్యమం ఓ ఆయుధంగా మారిపోయింది. ప్రజలు ఇలా చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవడం ఎంత మేరకు సబబంటూ 'సందట్లో సడేమియా' లా మీడియా ప్రవేశించి ఓ సర్వేను కూడా నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సబబేనంటూ 53 శాతం ప్రజలు, చట్టమే వారికి శిక్ష విధించాలంటూ 37 శాతం మంది ప్రజలు ఆ సర్వేలో అభిప్రాయపడటం విశేషం.
హుహాంకయోలో సెసీలియా రోడ్రిగ్స్ మొదట ఫేస్‌బుక్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒక రోజున ఆమె ఇంట్లో ఓ దొంగ జొరబడితే ఇరుగుపొరుగు సహకారంతో అతన్ని పట్టుకొని వీధిలో స్తంభానికి కట్టేసి ప్రజల ముందే చితకబాదింది. రెండు గంటల అనంతరం పోలీసులు వచ్చి దొంగను పట్టుకొని వెళ్లారు. ఆ తర్వాత అరగంటకే ఆ దొంగను పోలీసులు వదిలేశారని తెలిసి ఈ ఉద్యమాన్ని ఫేస్‌బుక్ ప్రచారం ద్వారా చేపట్టారు. 'ఇక దొంగల గురించి పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదు చేయవద్దు. దొరికిన దొంగను పట్టుకొని మనమే శిక్షిస్తే దొంగతనాలు జరగవు. మన భద్రత మనమే చూసుకోవడం ముఖ్యం' అంటూ పిలుపునిచ్చింది.
అంతే ఇలాంటి పిలుపునిచ్చే ఫేస్‌బుక్ పేజీలు వందకుపైగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఈ ఉద్యమం వెర్రితలలు వేసిన విషయాన్ని సెసీలియా వద్ద మీడియా ప్రస్తావించగా, 'ఇలా జరగకుండా ఉండాల్సింది. కానీ, ఏం చేస్తాం. పోలీసు వ్యవస్థ ప్రక్షాళనైతేగానీ పరిష్కారం లభించదు' అని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారిని తీవ్రంగా హెచ్చరించి, వదిలిపెడుతున్నారు. హెచ్చరికల అనంతరం కూడా చేసిన తప్పును మళ్లీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని వారు చెబుతున్నారు. తోటి వారిని గాయపరిస్తే నాలుగేళ్లు, ప్రాణం పోవడానికి కారణమైతే పాతికేళ్ల జైలు శిక్ష లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ పెరులో ఈ హింసాత్మక ఉద్యమం ఆగడం లేదు.