
ఎన్నికల తీరుపై అమెరికన్ల విరక్తి..
సర్వేలో వెల్లడి
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారా? ట్రంప్ గెలుస్తారా? అన్న ఉత్కంఠలో ప్రపంచం ఉండగా... అమెరికన్లు మాత్రం అంత ఆసక్తి చూపడం లేదట.. ఎన్నికల ప్రచార తీరుతో తాము తీవ్రంగా విరక్తి చెందామంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక/సీబీఎస్ న్యూస్ పోల్‌లో వెల్లడించారు. ఎక్కువ శాతం ఓటర్లు తాజా అమెరికా రాజకీయాల పట్ల అసహ్యం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌ల్లో ఎవరూ నిజాయితీపరులు కాదని, దేశాన్ని ఐక్యంగా ఉంచి పాలించే సామర్థ్యం వారికి లేదంటూ తేల్చిచెప్పేశారు. విద్వేష పూరిత ఎన్నికల ప్రచారంతో విసుగెత్తిన అమెరికన్లు దేశాన్ని ముందుకు నడిపించడంలో హిల్లరీ, ట్రంప్‌ల సమర్థతపై సందేహాలు వ్యక్తం చేశారు.
ప్రచారంతో ఆసక్తి కంటే విరక్తి చెందామని ప్రతీ పది మంది ఓటర్లలో 8 మందికి పైగా వెల్లడించారు. ఈ పోల్‌లో మాత్రం హిల్లరీ 45 శాతంతో ముందంజలో ఉండగా ట్రంప్ 42 శాతం మద్దతుతో వెనుకంజలో ఉన్నారు. మహిళా ఓటర్లలో ట్రంప్ కంటే హిల్లరీ 14 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా... పురుష ఓటర్లలో ట్రంప్ 11 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి 10 మందిలో ఆరుగురు చివరి నిమిషంలో ట్రంప్, హిల్లరీలపై ఏవైనా సంచలన వివరాలు వెల్లడైనా ఎవరికి ఓటు వేయాలన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోబోమన్నారు. క్లింటన్‌పై ఈ మెయిల్ ఆరోపణలతో మనసు మార్చుకున్న వారి కంటే ట్రంప్‌పై ఆరోపణలతో ప్రభావితమైనవారు ఎక్కువని సర్వే తేల్చింది.