
వాషింగ్టన్: అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్న ఓ కోడిపై స్థానికులు వాల్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్ పోలీసులు శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మాస్క్‌తో ఉన్న కోడి ఫొటోను పోస్టు చేస్తూ... ‘‘గత కొద్ది రోజులుగా ఈ కోడి లూసియాన బ్యాంక్ ఏటీవం వద్దకు వచ్చిపోయే వారిపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తోంది. అంతేగాక రోడ్డుపై సంచరిస్తూ వచ్చిపోయే కార్ల మీదకు ఎగురుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కోడిపై దర్యాప్తు చర్యలు చేపట్టాము. ఇక సదరు కోడి జాడ తెలిసిన వారు వెంటనే మాకు సమాచారం అందించండి’’ అంటూ పోస్టులో రాసుకుచ్చారు.
కాగా ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇక ‘కోడిపై వింతగా పోలీసు కేసు ఏంటి నమ్మశక్యంగా లేదు ఇది నీజమేనా మీరే క్రియేట్ చేశారా? అంటూ కొంతమంది పోలీసులను ఎదురు ప్రశ్నిస్తుంటే.. ‘ఆశ్చర్యంగా ఉంది.. లవ్ దిస్!!!’ అంటూ ‘ఆ కోడి రోడ్డుపైకి ఎలా వచ్చింది.. అది రోడ్డు ఎలా దాటింది’ ‘వాల్కర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ఆ కోడి రోడ్డు దాటిందేమో’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనిపై బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. కోడిపై సమాచారం అందించిన క్షణాల్లోనే పోలీసులు స్పందించారని చెప్పారు. అయితే పోలీసులు వచ్చేసరికి ఆ కోడి తప్పించుకుంది. ఇక ఆ కోడి నుంచి సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మళ్లీ అది కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించినట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment