చనిపోతుంటే ఏమౌతుంది?
మానవ శరీర నిర్మాణం ఒక్కోసారి సైన్స్కు కూడ అందనట్టుగా కనిపిస్తుంది. అద్భుతమైన, ఆశ్చర్యమైన ఎన్నో విషయాలను తెలుపుతుంది. ఎన్ని పరిశోధనలు జరిపినా ఇంకా ఏదో కొత్త అంశం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అయితే శరీరంలో అతి ముఖ్యమైన భాగంగా, ఆలోచనా శక్తినిచ్చే మెదడు నిర్మాణం, పనిచేసే తీరు చూస్తే నిజంగా ఓ అద్భుతమే అనిపిస్తుంది. అటువంటి బ్రెయిన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అంతుపట్టదనుకుంటాం. కానీ చనిపోయే సందర్భాల్లోనూ... భయంకరమైన సన్నివేశాన్ని ఎదుర్కొన్నప్పుడు మెదడు పనిచేసే తీరు ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికన్ కెమికల్ సొసైటీ విడుదల చేసిన వీడియో చెప్తోంది.
భయానక సన్నివేశాలున్న చిత్రాలు చూసినప్పుడు... రియల్ లైఫ్ లో భయంకరమైన సంఘటనను దర్శించినప్పుడు.. ముందుగా ఎంతో భయపడిపోతారు. ఆ తర్వాత ఆ సందర్శాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. లేదంటే దానికి దూరంగా అక్కడినుంచీ పారిపోతారు. అటువంటి భయాన్నిమెదడులోని భాగమైన థలామస్ నియంత్రిస్తుంటుందట. మెదడు కణాల్లోని క్లస్టర్ ద్వారా ఈ ఫీలింగ్ ను నియంత్రించవచ్చునని వీడియోలోని వివరాలద్వారా తెలుస్తోంది.
మెదడులోని థలామస్ ప్రాంతం ఎంతో సున్నితంగా ఉంటుంది. మానసిక, శారీరక ఉద్రిక్తతలకు సెన్సార్ లా పనిచేస్తుంటుంది. ఇక్కడి పెరియాక్వడక్టల్ గ్రే ప్రాంతానికి ఏదైనా సిగ్నల్స్ చేరుకున్నపుడు ఇది ఓ స్విచ్ లా పనిచేస్తుంటుందని వీడియో చెప్తోంది.
ఒత్తిడి, భయంకరమైన సందర్భాల్లో మెదడులోని అడ్రినల్ గ్రంథులు స్పందించి అడ్రినాలిన్ ను బయటకు తోస్తాయి. ఈ చర్యవల్ల ఉలికిపాటు కలిగి.. బ్రెయిన్ లో తక్షణ స్పందన ప్రారంభమౌతుంది. దీంతో గుండె కొట్టుకోవడంలో స్పీడ్ పెరుగుతుంది. ఆలోచనలు చురుకుగా వస్తాయి. ఈ క్రమంలో భారీ మొత్తంలో శక్తి బయటకు వస్తుంది. ఇది ఆయా సందర్భాలను ఎదుర్కొనేలా, తట్టుకునేలా చేస్తుంది. ఇటువంటి సమయాల్లో ఒత్తిడి తీవ్రంగా ఉంటే... మెదడు మొద్దుబారిపోతుంటుంది. జరగబోయే హానిని అంచనా వేసి ఆ పరిస్థితినుంచీ తప్పించే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీపై జరగబోయే దాడిని గుర్తించడం, హంతకులనుంచీ దూరంగా వెళ్ళేందుకు మనకు తెలియకుండానే ప్రయత్నం చేస్తుంటాం. ఇటువంటి సమయంలో మనకు తెలియకుండానే అరుపులు, కేకలు వేస్తుంటాం. ఈ సౌండ్ ఎమిగ్దాల అనే భాగం ద్వారా మెదడును అలెర్ట్ చేస్తుంది. సాధారణ సమయంలో మాట్లాడే మాటలు చెవులనుంచీ మెదడుకు చేరుతాయి. కానీ ఇటువంటి ఒత్తిడి సందర్భంలో 'ఎమిగ్దాల' మెదడుయొక్క ఎమర్జన్సీ సెంటర్ లా పనిచేస్తుంది. ఈ సయంలో స్వభావసిద్ధంగా వచ్చే అరుపులు ఎదుటివారిని కూడ భయపెట్టి.. వారు ప్రతిస్పందించడానికి కారణంగా మారతాయి. కేవలం సన్నివేశాన్ని చూసినప్పటికన్నా... గాయపడినప్పుడు నోసిసెప్టార్ గా పిలిచే న్యూరాన్లు మెదడుకు వెంటనే సందేశాన్ని పంపుతాయి. అంతేకాదు అటువంటి గాయాన్ని తగ్గించడంలో కూడ మళ్ళీ మెదడు ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఇదంతా థలామస్ ద్వారా జరుగుతుంది.
''సో నౌ యు ఆర్ డెడ్ ఆన్ ద ఫ్లోర్'' అంటూ కెమికల్ సొసైటీ విడుదల చేసిన వీడియో ఎన్నో విషయాలను చెప్తోంది. క్లినికల్లీ చనిపోయారని మీరు భావిస్తున్నపుడు.. మెదడుకు భారీగా గాయం తగిలినట్లు ఊహించినప్పటికీ మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మనిషి స్పృహతో మెదడుకు సంబంధం ఉండదని, చివరి క్షణం వరకూ పనిచేస్తూనే ఉంటుందని ఇటీవలి అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అయితే కొందరు ఇటువంటి అనుభవాలను మృత్యువుకు సమీపంగా వెళ్ళినట్లుగా నమ్ముతారని, కొందరు చనిపోవడం తమకు తెలిసినట్లుగా చెప్తారని అమెరికన్ కెమికల్ సొసైటీ వీడియో వివరిస్తోంది.
చెడు జ్ఞాపకాలను చెరిపేసే పసుపు..
సాధారణంగా కూరల్లో వాడే మసాలాలు... ముఖ్యంగా పసుపు... మెదడులోని చెడు జ్ఞాపకాలను చెరిపేసేందుకు ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇండియాలో పూర్వ కాలంనుంచీ ఓ ఔషధంగా కూడ వాడే పసుపు భయాన్ని దరిచేరనివ్వకుండా చేయడమే కాక... మెదడులో స్థిరపడిన దాన్ని కూడ తరిమి కొడుతుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే మానసిక వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందించేందుకు పసుపు సహాయపడుతుందని భావిస్తున్నారు. న్యూయార్క్ సిటీ విశ్వవిద్యాలయం సైకాలజిస్టులు.. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. ప్రొఫెసర్ గ్లెన్ ఛాఫే జరిపిన ఈ అధ్యయనం ద్వారా.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సహా... ఇతర మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఇచ్చే ఆహారంలో పసుపు వాడకం కూడ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు.